ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈరోజు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సమ్మెతో పాటు కొన్ని రూట్ల ప్రైవేటీకరణ గురించి ఈరోజు కోర్టు విచారించనుంది. హైకోర్టు ఈరోజు మధాహ్నం 2.30 గంటలకు సమ్మె, అఫిడవిట్ గురించి విచారణ చేయనుంది. కార్మికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని పరిష్కారం చూపించాలని గత విచారణలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా ప్రభుత్వం మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు 47 కోట్ల రూపాయలు చెల్లించినంత మాత్రాన పరిష్కారం కావని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఇబ్బందులు ఉండటం వలన బడ్జెట్ లో ఎక్కువ మొత్తం కేటాయించలేదని అఫిడవిట్ లో పేర్కొంది. ప్రభుత్వం ఆర్టీసీ యూనియన్లు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నాయని ఆరోపణలు చేసింది. 
 
ప్రభుత్వం సాధ్యం కాని డిమాండ్ల గురించి చర్చలు జరిపినా ఫలితం ఉండదని చెబుతోంది. గతంలో చర్చలు జరిపినా విలీనంతో సహా 26 డిమాండ్లపై చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరడంతో ఆ చర్చలు విఫలమయ్యాయని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. దాదాపు 10,600 బస్సులతో తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటైందని ప్రస్తుతం 2,600 బస్సులు మార్చాల్సి ఉందని ప్రభుత్వం అఫిడవిట్ లో చెబుతోంది. 
 
2020 సంవత్సరం మార్చి నెల నాటికి మరో 470 బస్సులకు కాలం చెల్లుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణ అంశం గురించి ఉదయం 10.30 గంటలకు హైకోర్టు విచారణ చేయనుంది. ఈరోజు వరకు 5,100 రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని గత విచారణలో కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీకి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని చట్టబద్ధమైన చెల్లింపులు చేయాల్సి ఉందని బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో 47 కోట్ల రూపాయలు కేటాయించలేని స్థితిలో ఉన్నామని ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: