ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మోహన్ కుమార్ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. కువైట్ లో పని చేసుకుంటూ ఆ పని ద్వారా సంపాదించిన డబ్బును మోహన్ ఇంటికి పంపించేవాడు. మోహన్ కుమార్ కు కువైట్ లో కొంతమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన స్నేహితులు ఉండేవారు. మోహన్ కుమార్ స్నేహితులైన మధు, దుర్గారావు, కొంతమంది స్నేహితులు మోహన్ కు బెట్టింగ్ అలవాటు చేశారు. 
 
బెట్టింగుల వలన మోహన్ తన స్నేహితులకు ఇండియన్ కరెన్సీలో 6,000 రూపాయలు బాకీ పడ్డాడు. కొన్ని కారణాల వలన స్నేహితుల అప్పును మోహన్ తీర్చలేకపోయాడు. బాకీ తీర్చకపోవటంతో మోహన్ స్నేహితులు మోహన్ పరువు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. మోహన్ ఫోటోలతో ఒక టిక్ టాక్ వీడియోను తయారు చేసి ఆ వీడియోలో మోహన్ చిట్టీల పేరుతో ఇండియన్ కరెన్సీలో 40,000 రూపాయలు మోసం చేశాడని పరారీలో ఉన్నాడని వీడియో వైరల్ చేశారు. 
 
తన స్నేహితులు తన పరువు తీయటంతో మనస్థాపం చెందిన మోహన్ కువైట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఎంబసీతో సంప్రదింపులు జరిపి మోహన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మోహన్ మరణానికి కారణమైన ఆరుగురు స్నేహితులపై మోహన్ కుటుంబ సభ్యులు కువైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఉపాధి కోసం వెళ్లిన మోహన్ చనిపోవటంతో రాజోలు మండలం శివకోడు పోస్టాఫీసు వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మోహన్ కుటుంబ సభ్యులు కువైట్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేయగా న్యాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో టిక్ టాక్ వీడియోల వలన కొందరు ఆత్మహత్యలు చేసుకోగా టిక్ టాక్ వీడియో మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: