గత 37 రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలో ప్రజా రవాణా సంస్థ ఇబ్బందులు పడుతున్నది.  సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను తీసుకొని బస్సులను నడుపుతున్నది.  ఇలా ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఉన్న ఆర్టీసీ ఎలా నడుస్తున్నదో అందరికి తెలిసిందే.  బస్సుల కండిషన్ తెలుసుకోకుండా బస్సులు నడుపుతుండటంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోతున్నాయి.  


ఇక కొంతమంది బస్సు కండక్టర్లు చేతివాటం చూపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.  నకిలీ టికెట్లు ఇస్తూ డబ్బులు దోచుకుంటున్నారు.  ఈ విషయం బయటపడటంతో ఆర్టీసీ షాక్ అయ్యింది.  ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో దీనిని పెడితే.. దాని వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో అందరికి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి ఆర్టీసీ జేఏసీ దూకుడు పెంచింది.  


ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఈ రోజు ఉదయం రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల ఇళ్లను ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.  వారి ఇళ్ల ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు.  దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడంతో... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది.  


ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు పోలీసులను కాపలాగా పెట్టింది.  అక్కడ బైఠాయించిన కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.  ఇక ఈరోజు నుంచి నలుగురు ఆర్టీసీ జేఏసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్న సంగతి తెలిసిందే.  ఈనెల 18 వ తేదీన సడక్ బంద్ నిర్వహించబోతున్నారు. అయితే, ఆర్టీసీ జేఏసీపై ఈరోజు హైకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.  హైకోర్టు నుంచే తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: