ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తీసుకున్న నిర్ణయంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అనేకమంది ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు, విమర్శలు కూడా గుప్పించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మండిపడ్డారు. తెలుగు మీడియంను వైసీపీ రద్దు చేస్తుంటే ఏపీలో అధికార భాషా సంఘం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు .
భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైసీపీ లీడర్లు నేర్చుకోవాలని అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసిఆర్ తెలుగు భాషను కాపాడడం కోసం కృషి చేస్తున్నట్టు పవన్ ఈ సంధర్భంగా చెప్పుకొచ్చారు. 2017లో జరిగిన తెలుగు మహా సభలను గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తే మన భాష, సంస్కృతి మరుగున పడిపోతాయని పవన్‌ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు . ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై పవన్, చంద్రబాబు సహా విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింనందుకు విమర్శలు చేస్తున్న వారంతా వాళ్ల పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలన్నారు జగన్.‘చంద్రబాబు కొడుకు, మనవడు ఎక్కడ చదువుతున్నారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా.. ముగ్గురు పెళ్ళాలు , నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు’ అంటూ సీఎం ప్రశ్నించారు.

ప్రపంచ స్థాయి కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే .. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, వెంకయ్య, నటుడు పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అంటూ మండిపడ్డారు. మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు.. ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒకసారి ఆలోచన చేయాలి అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: