రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు అనే మాటను మరోసారి చర్చకు పెట్టాయి బీజేపీ- శివసేన. ఎన్నికలకు ముందే కలిసి పోటీ చేసిన పార్టీలు.. ఎన్నికల తర్వాత విడిపోయాయి. సిద్ధాంతం, భావజాలం, ప్రజలు, పరిపాలన లాంటి వాటి కంటే పార్టీలకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? బీజేపీ- శివసేన మధ్య పొత్తు చిత్తవడానికి కారణం ఎవరు?


ఈ సారి మహారాష్ట్రకు శివసేన ముఖ్యమంత్రి అంటూ ఎన్నికల ముందు ప్రారంభమైన నినాదం ఎన్నికల తర్వాత శివసేన విధానంగా మారింది. ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే రొటేషనల్ సీఎం... అది కూడా ముందు తమకే అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు శివసేన నేతలు. మిత్ర పక్షం డిమాండ్‌ను మొదట్లో లైట్‌ తీసుకున్న బీజేపీ.. తర్వాత ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూసి ఖంగు తింది. ముఖ్యమంత్రి పదవి రెండేళ్లు కాదు.. రెండు నిముషాలు కూడా ఇచ్చేది లేదని కమలనాథులు మంకుపట్టు పట్టారు. పట్టువిడుపులు ప్రదర్శించాల్సిన చోట.. ఎవరికి వారే బెట్టు చేయడంతో.. పొత్తు కాస్తా చిత్తైంది.


ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన మొండిగా వ్యవహరిస్తోందనేది బీజేపీ ఆరోపణ. ఇందులో చాలా వరకూ వాస్తవం ఉంది. శివసేన మొండి పట్టుకు కారణం కూడా బీజేపీనే అన్న విషయాన్ని కమలనాధులు అంగీకరిస్తారా? కేంద్రంలో బలంగా ఉన్నంత మాత్రాన.. రాష్ట్రాల్లో మిత్ర పక్షాలు తమ మాటే వినాలన్న ఆలోచనలే ఉంది కమలదళం. అనువుగాని చోట అధికులమనరాదన్న మాటల్లో తాత్పర్యం అర్థమైనా.. కానట్లే వ్యవహరిస్తున్నారు బీజేపీ నేతలు. శివసేన తమ జూనియర్ పార్ట్‌నర్ అన్న బీజేపీ నేతల వైఖరి.. శివసేనకు ఆగ్రహం తెప్పిస్తోంది.


ఎన్నికల ప్రచారం సమయంలో... పుణేలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్రమోడీ.. శివసేనను చోటేమియా అని ప్రస్తావించారు. మిత్ర పక్షానిది తమ్ముడి స్థాయి అని చెప్పడం ద్వారా.. తనకు తానుగా బడేమియాగా ప్రకటించుకున్నారు. మోడీ వ్యాఖ్యలు అప్పట్లోనే శివసేన కార్యకర్తల్లో అహాన్ని దెబ్బ కొట్టాయి. సమాన భాగస్వామిని పట్టుకుని తమ్ముడని ప్రస్తావించడం ఏంటని అనుకున్నారంతా. ఇదిలా ఉండగానే పుండు మీద కారం చల్లినట్లు.. తమకు సింగిల్‌గానే 150కి పైగా సీట్లు వస్తాయనీ.. అవసరమైతే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమిత్‌షా మరో ప్రకటన చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గడంతో శివసేన తన డిమాండ్‌కు పదును పెంచింది.


90ల్లో శివసేనకు బీజేపీ కేంద్ర, రాష్ట్రాల్లో సమాన ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవించింది. వాజ్‌పేయి, అద్వానీ ఎప్పుడు ముంబయి వచ్చిన తప్పని సరిగా బాల థాకరేను కలిసేవారు. థాకరే ముంబయిలో కూర్చునే ఢిల్లీ రాజకీయాన్ని శాసించారు. అయితే 1999ల నాటి పరిస్థితి 2019 నాటికి మారిపోయింది. ఇప్పుడు అమిత్‌షా, మోడీ శకం నడుస్తోంది. ఎన్డీయే కూటమిలో తమకు తగిన గౌరవం దక్కడం లేదని శివసేన ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తోంది. గతంలో మోడీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి... మోడీ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. శివసేనలో అసంతృప్తి తగ్గించేందుకు.. బీజేపీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: