90 అసెంబ్లీ సీట్లున్న చోట.. రెండు సీట్లు గెలుచుకున్నా.. మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అలాంటిది 105 సీట్లు గెలుచుకున్నా.. మహారాష్ట్రలో అధికారాన్ని ఎందుకు వద్దనుకుంది?. శివసేనకు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ససేమిరా అనడానికి కారణాలేంటి?. కమలనాధులకు ప్రత్యేక వ్యూహం ఏదైనా ఉందా?. కర్నాటక తరహా ప్లాన్ సిద్ధం చేస్తోందా?


శివసేన- బీజేపీ బంధం ఎన్నికల కోసం పుట్టింది కాదు. రెండు పార్టీలదీ హిందూత్వ విధానం. శివసేన భూమి పుత్రుల సిద్ధాంతంతో విస్తరించినా.. దాని మూలాలు హిందుత్వంలోనే ఉన్నాయి. సిద్ధాంత పరంగా ఒకే రకమైన భావజాలం ఉన్న ఈ రెండు పార్టీలు చాలా త్వరగా కలిసిపోయాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇద్దర్నీ వేరు చేసి చూడలేని పరిస్థితి. అయితే బీజేపీ బలం పెరిగే కొద్దీ శివసేన ప్రాభల్యం తగ్గుతూ వచ్చింది. బాల థాకరే మరణించిన తర్వాత శివసేన ఎన్డీయే కూటమిలో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.


2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో సొంతంగానే మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినా.. అంతా బీజేపీ నేతల ఇష్ట ప్రకారమే సాగింది. గతంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పుడు.. భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయకర్తగా చంద్రబాబు ఉండేవారు. వాజ్‌పేయి ఏ నిర్ణయం తీసుకున్నా అందరితోనూ సంప్రదించేవారు. మోడీ హయాంలో ఆ తరహా వ్యవహారాలేవీ లేకపోవడం శివసేనకు రుచించలేదు. మోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. నోట్ల రద్దు తుగ్లక్ చర్య అంటూ సామ్నాలో వ్యాసాలు రాసి తన అక్కసు వెళ్లగక్కింది శివసేన.


ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తర్వాత మహారాష్ట్రలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించింది. గుజరాత్‌లో బీజేపీపై కత్తి దూసిన పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌ను గుజరాత్ శివసేన చీఫ్‌గా ప్రమోట్ చేశారు ఉద్దవ్ థాకరే. మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. అయితే అమిత్‌షా ముంబయి వచ్చి ఉద్దవ్‌తో మాట్లాడటంతో పరిస్థితులు సర్దుకున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి.


బీజేపీ అధినాయకత్వం.. తనకు అవసరమైనప్పుడు.. ముంబయి వస్తోందని.. అదే తాము ఏదైనా అడిగితే స్పందించడం లేదని.. శివసేన అధ్యక్షుడు భావిస్తున్నారు. బీజేపీ అవసరాలకు తాము ఉపయోగపడుతున్నామే తప్ప.. ఒక భాగస్వామ్య పార్టీగా కమలనాథులు తమను గుర్తించడం లేదనేది శివసైనికుల ఆవేదన. తాజాగా ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ వైఖరి మరోసారి బయటపడిందని శివసేన భావిస్తోంది. అందుకే తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే బీజేపీతో కలిసేది లేదని తెగేసి చెప్పింది. ఎన్డీయే నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.


బీజేపీ- శివసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాల విషయంలో బీజేపీ కంటే శివసేన మెరుగైన పనితీరు కనబర్చింది. శివసేన అడుగుతున్నట్లు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీకి పెద్ద నష్టమేమీ లేదు. అయినా సరే... ఆ ఒక్క డిమాండ్ తప్ప అంటోంది కమలదళం. మహారాష్ట్రలో శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. భవిష్యత్‌లో మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా ఇలాంటి డిమాండ్ చేసే అవకాశం ఉందని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకే శివసేన డిమాండ్‌కు నో చెప్పినట్లు సమాచారం.


శివసేన ఇప్పుడు కాంగ్రెస్- ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అది ఏడాదికో రెండేళ్లకో కూలిపోతుందనేది బీజేపీ నేతల అంచనా. అప్పుడు ఎన్నికల్లో మిగతా పార్టీలన్నింటినీ దోషులుగా చూపించి.. ఒంటరిగా పోటీ చేసి.. మరిన్ని సీట్లు గెలుచుకోవచ్చని కమలనాధులు అంచనా వేస్తున్నారు. అలా కాకుండా కర్నాటక తరహాలోనే.. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నుంచి 40మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే.. బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేని పరిస్థితి. తమ సంఖ్య పెరుగుతుందని.. శివసేన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నాయకులు గతంలో చేసిన ప్రకటనలు దీన్ని బలపరుస్తున్నాయి.


మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. ప్రభుత్వం నడవాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. కేంద్రంతో గొడవ పడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం అంత తేలికైన వ్యవహారం కాదు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. శివసేన ప్రభుత్వానికి కష్టాలు మొదలైనట్లే. మోడీ, అమిత్‌షా లాంటి వాళ్లతో వైరం తేలికే కావచ్చు కానీ.. వాళ్లతో పోరాటం అంత తేలిక్కాదనేది.. ఏపీలో కనిపిస్తున్న పరిణామం. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి చూస్తూ కూడా.. ఉద్దవ్ థాకరే మొండిగా వ్యవహరిస్తున్న తీరు.. ఆయనను సమకాలీన రాజకీయాలకు కథానాయకుడిగా నిలబెడుతోందని చెప్పవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: