ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చే  అవకాశం ఉన్న పార్టీలో చేరడం... పదవులు అనుభవించడం.. అధికారం పోయాక మరో పార్టీలో చేరడం.. ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం ఇదే. టీడీపీ ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అంటున్నారు సన్నిహితులు.  


టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఆయనతోపాటు మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసిన గంటా కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎవరెవరు బీజేపీలో చేరతారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. పార్టీ మారితే అనర్హత వేటు, ఇతర న్యాయపరమైన చిక్కుల గురించి గంటా రామ్‌మాధవ్‌తో చర్చించినట్లు సమాచారం. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా, సుజనా, సీఎం రమేష్‌తో కూడా చర్చలు జరిపారు.


గంటా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలంతా ఇసుక దీక్ష చేపట్టినా గంటా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ విశాఖలో చేపట్టిన లాంగ్‌ మార్చ్‌లో టీడీపీ నేతలు పాల్గొన్నా.. గంటా సిటీలో ఉండి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. గంటా బీజేపీ చేరిక వెనుక సుజనా చౌదరి, సీఎం రమేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గంటా చేరికను వ్యతిరేకిస్తున్నారు.


గంటా పార్టీలు మారడం ఇదే కొత్త కాదు. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించినా... తర్వాత పీఆర్పీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత.. మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి మళ్లీ మంత్రి అయ్యారు. ఎన్నికల ముందే ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్లనే ఆయన ఫ్యాను పార్టీలో చేరలేదనేది స్థానికంగా వినిపించే మాట. టీడీపీ ఏపీలో దారుణంగా ఓడిపోవడంతో ఆయన ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.


గంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే జగన్ నిబంధన వల్లనే ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గంటా చాలా స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. మళ్లీ వైసీపీ తరపున పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్న సంశయం వల్లనే వైసీపీని పక్కన పెట్టి.. బీజేపీలో చేరాలని భావించినట్లు తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: