తెలంగాణ‌లో జ‌రుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం వాదనలను కొనసాగించిన హైకోర్టు..  ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఇక ఈ స‌మ్మెపై సామాన్య ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే స‌మ్మె చట్ట విరుద్ధం అంటూ ఓ పిటిష‌న్ హైకోర్టులో పిటిష‌న్ వేశాడు. దీనిపై ఆ పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది కోర్టులో వాద‌న‌లు వినిపించాడు.


ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే కోర్టు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. కేవ‌లం అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. అలాగే కోర్టు పిటిష‌న‌ర్‌కు మొట్టికాయ‌లు కూడా వేసింది. ప్ర‌జాప్ర‌యోజ‌నాల పేరిట ఎలాంటి ఆధారాలు లేకుండా.. ప‌స‌లేని అంశాల‌ను కోర్టు ముందుకు తీసుకు వ‌స్తే రిలీఫ్ ఇవ్వ‌లేమ‌ని చెప్పింది.


అలాగే ప్ర‌జాప్ర‌యోజ‌నాల పేరిట స‌మ్మెను చ‌ట్ట విరుద్ధంగా ఎలా ?  ప్ర‌క‌టిస్తాం ? అని కూడా చెప్పింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని తాము గ‌తంలో కోరిన విష‌యం కూడా కోర్టు ఇక్క‌డ స్ప‌ష్టం చేసింది. అలాగే హైకోర్టు.. విచారణను రేపట్టికి వాయిదా వేసింది. ఇక, రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.


స‌మ్మె నేప‌థ్యంలో ఆర్టీసీ సంస్థ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రప్రభుత్వం తాజాగా నివేదిక సమర్పించింది. కోర్టు సూచించిన రీతిలో నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47కోట్లు ఆర్టీసీకి చెల్లించినప్పటికీ సమస్య పరిష్కారం కాదని తెలిపింది. ఆర్టీసీకి చెల్లింపులు, రుణాలు, నష్టాలను పూడ్చడానికి రూ.2,209 కోట్లు అవసరమన్న ప్రభుత్వం రూ.47 కోట్లు ఏమూలకు సరిపోవని నివేదికలో పేర్కొంది. కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భీష్మించుకుని కూర్చుంటే చర్చలు సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: