తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు?  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పదవీ కాలం ముగుస్తూ ఉండటంతో కొత్త చీఫ్ ఎవరనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరికి వారే పీసీసీ అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. చాలా మంది పోటీ పడుతున్నా.. ముగ్గురు నాయకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు సమాచారం. 


తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీలో కదలిక మొదలైంది. అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకొంటానని ఉత్తమ్‌ చెప్పడంతో కొత్త చీఫ్‌ ఎంపికకు అధిష్ఠానం కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ నాయకత్వం కోసం చాలా మంది పోటీ పడుతున్నా.. రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రేసులో ఉన్నారు. ఉత్తమ్‌ పదవీకాలం ఏడాది కిందటే పూర్తయినా ఎన్నికల దృష్ట్యా ఆయననే కొనసాగించాల్సి వచ్చింది. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో ఓటమి తర్వాత పదవి నుంచి తాను తప్పుకోవాలనుకుంటున్నట్లు ఉత్తమ్‌ సోనియాతో చెప్పినట్లు సమాచారం.


సీడబ్ల్యూసీ నేత గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌కు వచ్చిన సమయంలోనూ మునిసిపల్‌ ఎన్నికలకు ముందే టీపీసీసీకి కొత్త సారథిని నియమించాలని నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీ పీసీసీ చీఫ్‌ పోస్ట్‌ తనకు ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆజాద్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే కొత్త సారథిని నియమించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.


లోక్‌సభ ఎన్నికల తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్‌రెడ్డి పేరును అధిష్ఠానం ప్రధానంగా పరిశీలించింది. అయితే రేవంత్ నాయకత్వంపై పార్టీ నేతలు కొంతమంది బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ కోటాలో పీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్న వి.హన్మంతరావు.. రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాను కూడా పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఎస్సీని నియమించాలని భావిస్తే.. తనకు అవకాశం ఉంటుందని సంపత్‌ భావిస్తున్నారు. బీసీ కోటాలో మధుయాష్కీ సైతం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రేవంత్‌కు ప్రత్యామ్నాయంగా జానారెడ్డి పేరును కొందరు, వివాద రహితుడిగా పేరున్న శ్రీధర్‌బాబును మరికొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.


రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి రీత్యా పీసీసీ చీఫ్‌ ఎంపిక అధిష్ఠానానికి సవాల్‌ లాంటిదే. ఇప్పటికే చాలా మంది నేతలు టీఆర్ఎస్‌లో చేరగా.. ఇంకొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు. పీసీసీ చీఫ్‌ ఎంపికలో ఏమాత్రం సమతుల్యత లోపించినా.. పార్టీ నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంది. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులను ఉరకలెత్తించాలంటే సమర్థుడైన నాయకుడికి బాధ్యతలివ్వడం తక్షణ అవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: