అనాదికాలం నుంచి సమాజంలో పురుషాధిక్యత వుంటోంది. మహిళలంటే చిన్న చూపు. బానిసలనే భావం, చెప్పింది చేయాలి అనే అధికార తత్త్వం.  తమ చెప్పు చేతల్లోనే ఉండాలనే భావం మహిళలపై వుంది.  అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, యాసిడ్ దాడులు మహిళలపై అధికంగా జరుగుతున్నాయి  స్త్రీ క‌నిపిస్తే చాలు అది పెద్దా చిన్నా అన్న ఆలోచ‌న కోల్పోతున్నాడు మ‌గాడు. ఆడ‌దాన్ని చూడ‌గానే మృగాళ్లుగా మారిపోతున్నారు. కేవ‌లం కోరిక‌లు తీర్చే కామాన్ని చూస్తున్నారు. 

పురాణాలలో స్త్రీని సమానంగా చూసేవారు. పూజించేవారు. మంత్రిలా సలహాలు కూడా అడిగేవారు.  ఆమెలో తల్లిలా లాలించే ప్రేమమూర్తినే చూశారు. కాలం మారుతున్న‌ కొద్దీ స్త్రీని ఒక ఆటవస్తువుగా మార్చేసారు. తమ అవసరాలు తీర్చే బానిసని చేసారు. పైశాచికత్వానికి నిదర్శనం అంటే ఆ  మధ్య జరిగిన నిర్భయ ఉదంతం. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. అత్యధికంగా గౌరవించబడే విద్యలో రాణించే వైద్య విద్యార్ధిని ఘోరాతి ఘోరంగా మానభంగానికి గురయ్యిందంటే మహిళలకు ఎంత భద్రత వుందో అర్థం అవుతోంది. 

ఒక అభయ, ఒక అనూహ్య, ఒక యువ జర్నలిస్ట్ ఇలా ఎందరో మహిళలు అత్యాచారానికి గురవుతూనే వున్నారు. దళిత మహిళలపై కుడా సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆంధ్రాలో వైద్య విద్యార్ధిని శ్రీలక్ష్మి   వేధింపులు తాళలేక ఆ మ‌ధ్య‌ ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఎన్నో ఎన్నెన్నో రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ నేరాలు పెరుగుతున్నాయేగాని త‌గ్గ‌డం లేదు.  ప‌సికందులు అని కూడా చూడ‌కుండా విచ‌క్ష‌ణార‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఎదగాలనుకుంటున్న భారత దేశం మహిళలపై, బాలికలపై జరిగే అత్యాచారాలలో, హత్యలలో ముందు వరసలో అంటే ప్రపంచం లోనే మూడో స్థానంలో ఉండటం అనేది ఆలోచించాల్సిన విష‌యం. వాస్తవానికి ప్రపంచ వ్యాపితంగా మహిళల అణిచివేతలో కొద్దో గొప్పో తేడాలు ఉన్నాయే తప్ప ఏ దేశమూ మినహాయింపు కాద‌నే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: