తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అనే ప్రశ్న ఎవరైనా అడిగితే సమాధానం లేదనే వస్తుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ దాదాపు కనుమరుగైపోయినట్లే. రాష్ట్ర విభజన తర్వాత అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలో పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. దీంతో నేతలంతా ఎవరి దారి వారు చూసుకున్నారు. అధిక శాతం నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతే మిగిలిన వారు కాంగ్రెస్, బీజేపీల్లోకి జంప్ కొట్టేశారు. అయితే ఇక్కడ నేతలు మాత్రమే పార్టీలు మారలేదు. టీడీపీ కేడర్ మొత్తం కట్టగట్టుకుని టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయింది.


ఇక అక్కడక్కడ కొందరు కాంగ్రెస్, బీజేపీలకు మద్ధతు తెలుపుతున్నారు. అయితే ఎంతమంది పార్టీలు మారిన ఆ రాష్ట్రంలో మిగిలి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మాత్రం అలాగే ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఆయన కూడా పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. అది కూడా ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలోనే సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావులు. వీరిలో సండ్ర ఎప్పుడో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.


కానీ తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని మెచ్చా అలాగే ఉండిపోయారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ మనుగడ సాగించడం గగనం. పైగా ఇంతకాలం నేతలు మారిన కేడర్ మారలేదని సర్దిచెప్పుకున్న వారికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక షాక్ ఇచ్చింది. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్ధి 2వేలు ఓట్లు కూడా తెచ్చుకోలేక చతికలపడింది. ఇదివరకు హుజూర్ నగర్ ప్రాంతంలో టీడీపీకి కొంతపట్టు ఉంది. అలాంటి చోటే టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉంటే కష్టమని, భవిష్యత్ కూడా ఉండదని అశ్వరావుపేట టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు చెబుతున్నట్లు తెలిసింది.


ఇక పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో పాటు కేసీఆర్ టార్గెట్ చేస్తోన్న పార్టీ కావ‌డంతో అక్క‌డ అస్స‌లు ప‌నులు కావ‌డం లేదు. మ‌రోవైపు ఎంపీ నామా కూడా మెచ్చాను పార్టీ మారాల‌ని ప్రెజ‌ర్ చేయ‌డంతో ఎమ్మెల్యే కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా టీడీపీలో ఉండలేనని ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. మరి చూడాలి తెలంగాణలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే ఎప్పుడు జంప్ కొడతారో?



మరింత సమాచారం తెలుసుకోండి: