ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. నేతలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బ్రాండ్‌ హైదరాబాద్‌ను దెబ్బతీయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ. 


ఛలో ట్యాంక్‌బండ్ లో పోలీసుల లాఠీ ఛార్జిని నిరసిస్తూ.. తెలంగాణలో మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు కార్మికులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి తమ గోడు విన్పించారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడమని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తేల్చి చెప్పారు. 


జేఏసీ పిలుపు మేరకు సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు ఇంటి ముట్టడికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాళ్లు పట్టుకున్నారు ఆర్టీసీ మహిళా కండక్టర్లు. రెండు నెలల నుంచి జీతాలు లేవని, కుటుంబ పోషణ భారం కష్టమవుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. 


నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బోథ్‌లో రాథోడ్ బాపురావ్, ఖానాపూర్‌లో రేఖానాయక్ ఇళ్లముందు ధర్నా చేపట్టారు కార్మికులు. ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మెపై నోరువిప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిరసన సెగలు ఢిల్లీకి వ్యాపించాయి. కార్మికులకు మద్దతుగా డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని తెలంగాణ భవన్‌ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.


అయితే.. హైదరాబాద్‌ బ్రాండ్‌ను దెబ్బతీస్తే.. చూస్తూ ఊరుకోమని సీపీ హెచ్చరించారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. చలో ట్యాంక్‌బండ్‌ పరిణామాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు పోలీసులు. తెలంగాణ మంత్రుల క్వార్టర్స్ పోలీసు భద్రత వలయంలోకి వెళ్లిపోయింది. బంజారాహిల్స్‌లోని మంత్రుల ఇళ్ల దగ్గర భారీభద్రత ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్యూఆర్టీ సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. క్వార్టర్స్‌కు దగ్గర నిషేధ ఆంక్షలు విధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: