మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు .  ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతో పాటు, మురుగు నీటిని (సీవరేజ్)  ట్రీట్ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృయోపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంభించాలని కేంద్ర మంత్రి సూచించారు.


సోమవారం  ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్నిపవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి  వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 24వేల ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు ఉపరితల జలాలను మంచినీరుగా అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టామని చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేదని , చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉండేదని అన్నారు . అసలు తాగునీళ్లే దొరకక పోయేదని ,  దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారని చెప్పుకొచ్చారు .


అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ది చేసి ప్రతీ రోజు ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు . ఈ  పథకం దాదాపు పూర్తయందని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని కేసీఆర్ , కేంద్ర మంత్రికి చెప్పారు . . రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని , అప్పటి అవసరాలు కూడ తీర్చే విధంగా ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశామని అన్నారు .  ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిదని,  ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడవద్దని కేంద్ర మంత్రి ని, ముఖ్యమంత్రి కోరారు .


మరింత సమాచారం తెలుసుకోండి: