వినియోగదారుల అవసరాల మేరకు ఇసుక సరఫరా మొదలైంది. వరద, వర్ష ప్రభావం తగ్గుతుండటంతో ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. రోజుకు సగటున లక్ష టన్నుల దాకా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాటిల్లో అత్యధికం స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుండి ఆన్ లైన్లో వినియోగదారులకు అమ్ముతున్నారు. రోజుకు పది లక్షల టన్నుల ఇసుక అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

 

ఇసుక అవసరమైనంత దొరుకుతున్న సమయంలో చంద్రబాబునాయుడు దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ఈనెల 14వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ లో చంద్రబాబు 12 గంటలపాటు దీక్ష చేయబోతున్నారు. ఉదయం 8 గంటలకు మొదలై రాత్రి 8 గంటలకు దీక్షను ముగించాలని టిడిపి ప్లాన్ చేసింది. ప్లానింగ్ వరకు బాగానే ఉంది కానీ దీక్ష చేస్తున్న సమయమే బావోలేదు.

 

దాదాపు మూడు నెలల పాటు వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా  రాష్ట్రంలో ఇసుక దొరకలేదన్నది వాస్తవం. టిడిపి హయాంలో జరిగిన ఇసుక దోపిడిని అరికట్టి పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేద్దామని జగన్ అనుకున్నారు. కానీ ఒకటనుకుంటే మరొకటి జరిగింది. నూతన విధానం అమల్లోకి వచ్చేలోగానే వర్షాలు, వరదలతో ఇసుక తవ్వకాలు సాధ్యం కాలేదు. సరే ఇసుక వివాదంపై రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ అంతా అందరికీ తెలిసిందే.

 

ఇసుక కొరతపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు 14వ తేదీన దీక్ష చేయబోతున్నారు. మొదటి గుంటూరులో నారా లోకేష్ దీక్ష చేశారు. తర్వాత విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ పేరుతో రాంగ్ మార్చ్ జరిగింది.

 

అప్పట్లో వాళ్ళిద్దరూ దీక్షలు చేశారంటే అర్ధముంది. ఎందుకంటే అప్పటికింకా వరద, వర్షాల ప్రభావం తగ్గలేదు కాబట్టి ఇసుక తవ్వకాలు మొదలుకాలేదు. అయితే గడచిన వారం రోజులుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు సరఫరా కూడా ఊపందుకుంది. పోను పోను అడిగిన వాళ్ళకు అడిగినంత ఇసుకను సరఫరా చేయబోతున్నట్లు రామచంద్రారెడ్డి ప్రకటించారు. మరి సమస్య పరిష్కారమైపోయిన తర్వాత చంద్రబాబు దీక్ష చేసి ఉపయోగమేంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: