అనుకున్నట్లే ఆర్టీసీ సమ్మె విషయంలో  కెసియార్ ప్రభుత్వానికి  హై కోర్టు షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధం కాదని కోర్టు ఈ రోజు విచారణలో తేల్చేసింది. సమ్మె చేస్తున్న సిబ్బందిపై ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్  మెయిన్ టెనెన్స్ యాక్ట్ ప్రయోగించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా  న్యాయమూర్తి  సాధ్యం కాదు పొమ్మన్నారు.

 

ఆర్టీసీ సర్వీసులు  అత్యవసర సర్వీసుల క్రిందకు రాదని కోర్టు స్పష్టంగా చెప్పేసింది. కాబట్టి వారిపై ఈ యాక్ట్ క్రింద చర్యలు తీసుకునే అవకాశాలు లేవన్నది. దాంతో కేసియార్ కు నిజంగా షాక్ కొట్టినట్లయ్యింది. తన ఆదేశాలను పూచికపుల్లతో సమానంగా తీసేసిన కార్మికులు, ఉద్యోగులు గడిచిన 39 రోజులుగా నిరవధిక సమ్మె చేయటాన్ని కేసియార్ తట్టుకోలేకపోతున్నారు.

 

అందుకనే సిబ్బందిపై ఒక విధంగా పగపట్టారనే చెప్పాలి.  సిబ్బందిపై చర్యల విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్లుగా ఏమీ చేయలేకపోతున్నారు. దాంతో ఆర్టీసీ యూనియన్ నేతలపై కసి పెరగిపోతోంది. 5100 రూట్లను ప్రైవేటుపరం చేద్దామని అనుకుంటే కేంద్రం, కోర్టు అడ్డుకున్నాయి. సిబ్బందిని తీసేద్దామని అనుకుంటే కోర్టు కుదరదని చెప్పింది.

 

అందుకనే ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు సమ్మె జరిగేలా కేసియార్ యూనియన్ నేతలను రెచ్చగొడుతున్నారు. సమ్మె విరమణ విషయంలో  కోర్టు కూడా చేతులెత్తేసింది. దాంతో కేసియార్  ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.

 

మొత్తానికి సమ్మెకు సంబంధించి  ఏ విషయంలో కూడా  కేసియార్ కు ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిన కోర్టు సిఎం తీసుకుంటున్న నిర్ణయాలు అమల్లోకి రాకుండా మాత్రం అడ్డుకుంటోంది.  అందుకనే సిఎంలో అసహనం పెరిగిపోతోంది. సమ్మె విషయంలో ఇటు కేసియార్ అటు యూనియన్ నేతలు ఎవరు వెనక్కు తగ్గకపోవటంతో  జనాలు మాత్రం మండిపోతున్నారు. రెండు వర్గాలపైన తమ ప్రతాపాన్ని జనాలు తీవ్రస్ధాయిలోనే చూసిస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి కేసియారే ఓ మెట్టుదిగితే బాగుంటుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: