వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బీజేపీ నుంచి వూహించని మద్దతు లభించింది. గత కొంతకాలంగా జగన్ని టీడీపీ కంటే దారుణంగా టార్గెట్ చేస్తున్న బీజేపీ నుంచే జగన్ కి మద్దతు లభించడం విశేషం. జగన్ చేపడుతున్న కార్యక్రమాలకు బీజేపీ నుంచి విమర్శల జడివాన తప్ప సలహాలు, సూచనలు అసలు లభించడంలేదు. అదే విధంగా ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ని కలసిన ఏపీకి సంబంధించి  రాజకీయ పార్టీల నేతలు లేరు.


ఈ నేపధ్యంలో బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన  సోము వీర్రాజు ఈ రోజు ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశం అయింది. జగన్ ఏపీలో చేస్తున్న పాలన గురించి కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. అదే సమయంలో ఏపీలో రాజధాని పనులు, అభివ్రుధ్ధి వికేంద్రీకరణతో పాటు, ఆంగ్ల భాషా మాధ్యయం ప్రాధమిక విద్యలో ప్రవేశపెట్టడం వంటి అంశాలు కూడా ఇద్దరి మధ్యన చర్చకు వచ్చినట్లుగా సమాచారం.


దీని మీద మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం జగన్ని కలిశానని చెప్పారు. అదే సమయంలో రాజధాని విషయంలో హంగూ ఆర్భాటాలు చేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున  హైప్ క్రియేట్ చేశారని సోము ఆరోపించారు. ఏపీ రాజధానికి ఏడువేల కోట్లు ఖర్చు పెట్టానని బాబు అంటున్నారు. ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరినట్లుగా చెప్పారు.


ఇదిలా ఉండగా రాజధాని విడిపోయిన రాష్ట్రానికి అవసరమని, దానితో పాటు అభివ్రుద్ధి వికేంద్రీకరణ కూడా అవసరమని ఆయన ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకువచ్చినట్లుగా చెప్పారు, ఇదే విషయమై రాజధాని నిపుణుల కమిటీకి తాను ఇచ్చిన సూచనలనే ముఖ్యమంత్రికి కూడా వివరించినట్లుగా సోము వీర్రాజు చెప్పారు. ఇక ఇపుడున్న రోజులో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వారు ప్రైవేట్ స్కూళ్ళలో 58 శాతం ఉంటే తెలుగు చదువుతున్న వారు ప్రభుత్వ పాఠశాల్లో 42 శాతం ఉన్నారని ఆయన అన్నారు.


తన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారని చెప్పారు. పోటీ పరీక్షల్లో పైకి రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువులు అవసరమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే  తెలుగు కూడా అవసరమేనని కూడా చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ కార్యక్రమాలను మద్దతుగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేతలు ఉండడం నిజంగా అనూహ్య పరిణామ‌మే.



మరింత సమాచారం తెలుసుకోండి: