గత ఐదేళ్లు దర్జాగా అధికారం అనుభవించిన టీడీపీ నేతలు రాజకీయ జీవితాన్ని 2019 ఎన్నికలు మార్చేశాయి. చరిత్రలో లేని ఘోర ఓటమి తెలుగుదేశం నేతలని బయటకు రానివ్వకుండా చేసింది.  ఈ ఘోర ఓటమికి చాలామంది నేతలు బలైపోయారు. అలాగే కొందరు పార్టీలు మారిపోయారు. మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఇక ఈ ఓటమి వల్ల బీదా బ్రదర్స్ కూడా గట్టి దెబ్బ తిన్నారు. నెల్లూరు జిల్లాలో మంచి పట్టున్న బీదా మస్తాన్ రావు, బీదా రవిచంద్ర యాదవ్ లకు మొన్న ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చింది.


ఎమ్మెల్సీగా ఉన్న రవిచంద్ర నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. అధ్యక్షుడుగా ఉన్న ఈయన మాట మిగతా నాయకులు పెద్దగా వినడం లేదు. దీంతో రవిచంద్రా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. ఏదో ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి శాసనమండలి సమావేశాల్లో మాత్రం కనిపిస్తున్నారు. అటు రవిచంద్ర సోదరుడు, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న మస్తాన్ రావు అయితే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఓ రకంగా మస్తాన్ రావు రాజకీయ జీవితాన్ని చంద్రబాబే బలి చేశారు. కావలి అసెంబ్లీలో పట్టున్న మస్తాన్ రావుని మొన్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు.


ఇక్కడ మామూలుగానే వైసీపీకి గట్టి పట్టుంది. అలాంటి చోట మస్తాన్ రావు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అటు కావలితో పాటు జిల్లా మొత్తం వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఇక  సొంత నియోజకవర్గం కావలిలో కూడా బీదా బ్రదర్స్ పట్టు కోల్పోయారు. అటు ఆర్ధికంగా బీదా బ్రదర్స్ దెబ్బతిన్నారు. ఎన్నికల ముందు ఐ‌టి రైడ్స్, తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. వెరసి బీదా బ్రదర్స్ రాజకీయ జీవితం సంక్షోభంలో పడిపోయింది. భవిష్యత్ లో కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం ఖాయంగా కనబడటంతో బీదా బ్రదర్స్ రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: