రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుభాషపై మమకారం, అభిమానం లేవని, తనకు సరిగా తెలుగుమాట్లాడటం రాదుకాబట్టి, రాష్ట్రంలో ఎవరూ తెలుగుమాట్లాడకూడదు, ఎక్కడా తెలుగుభాషబతికి ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌, మాతృభాషను మృతభాషగా మార్చడానికి ప్రయత్ని స్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆక్షేపించారు. ప్రతిమనిషి అమ్మను ప్రేమించినట్లుగా మాతృభాషను అభిమానించి, ఆరాధిస్తాడని, అటువంటి భాషకు సమాధికట్టే చర్యలకు జగన్మోహన్‌రెడ్డి పూనుకోవడం దురదృష్టకరమన్నారు. జీవో నెం-81ని ఇచ్చిన ముఖ్యమం త్రి, ఉన్నపళంగా సర్కారుబడుల్లో ఆంగ్లబోధన సాధ్యం కాదనే విషయాన్ని కూడా గ్రహించ లేకపోవడం విచారకరమని కాలవ వ్యాఖ్యానించారు. 

1 నుంచి 8వరకు ఆంగ్లంలోనే బోధన ఉండాలని చెప్పి, ఇప్పుడు దాన్ని 6వతరగతి వరకు మాత్రమే పరిమితం చేసిన  ప్రభుత్వం, విద్యార్థులకు ఆంగ్లంపై పట్టుసాధించే వెసులుబాటు ఇవ్వకుండా ఏకపక్షంగా అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. దేశభాషలందు తెలుగులెస్స అని కీర్తించిన శ్రీకృష్ణదేవరాయల గొప్పతనాన్ని, భాషావికాసమే దేశపురోగతికి మేలైన మార్గమన్న స్వామివివేకానంద వ్యాఖ్యలను  విస్మరించిన ప్రభుత్వం, తెలుగుభాషను విస్తృతం చేయడానికి బదులు దాన్ని చంపేసే కుట్రకు పాల్పడుతోందని మాజీమంత్రి మండిపడ్డారు. 
తెలుగువారి ఆత్మగౌరవానికి, సంక్షేమానికి, ఆత్మాభిమానానికి విలువనిచ్చే తెలుగుదేశంపార్టీగానీ, స్వర్గీయ ఎన్టీఆర్‌, చంద్రబాబుగానీ తెలుగుభాషను విచ్ఛిన్నం చేసేలా ఎన్నడూ నిర్ణయాలు తీసుకోలేదని కాలవ స్పష్టంచేశారు. ఆంగ్లం నేర్చుకోవడం తప్పులేదు గానీ, అదేసర్వస్వమన్నట్లుగా ప్రవర్తించడం సరికాదని, మాతృభాషలో పట్టులేకపోతే మానసిక వికాసంగానీ, విషయపరిజ్ఞానంగానీ, సాధ్యపడవన్న మేథావుల మాటలను రాష్ట్రప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. మాతృభాషను చంపేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే, భాషోద్దారకులమని చెప్పుకునే యార్లగడ్డ వంటివారు దాన్నిసమర్థించ డం సిగ్గుచేటని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 


తన పాదయాత్ర సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చేసిన అభ్యర్థనతో జగన్మోహన్‌రెడ్డి, ఆంగ్లమాధ్యమాన్ని  తీసుకొచ్చారని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పరాయిభాషలో పాఠ్యాంశా లుంటే, ప్రాథమికస్థాయిలో విద్యార్థులు ఎంతవరకు వాటిని అర్థంచేసుకోగలరో, ఏవిధమైన శిక్షణలేకుండా ఉపాధ్యాయులు వాటిని సులభతరంగా అర్థమయ్యేలా ఎలాబోధించగలరో  ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని కాలవ డిమాండ్‌చేశారు. పాఠ్యాంశాలన్నీ తెలుగులో ఉంటే, వాటిని అర్థంచేసుకోవడం తేలికవుతు ందని, భాషపై పట్టులేకుండా ఏంచదివినా, ఎంతసాధించినా ఉపయోగం ఉండబోదని ఆయన స్పష్టంచేశారు. 


తెలుగుభాషనుబలి తీసుకునే తన నిర్ణయాన్ని సమర్థించుకునే క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌, చంద్రబాబుపై, పవన్‌కళ్యాణ్‌పై అభాండాలు వేశారన్నారు. జగన్‌గానీ, ఆయనకుటుంబసభ్యులు, వారి పిల్లలను ఆంగ్లంలో చదివించుకోవడాన్ని ఎవరూ తప్పపట్టరని, మేథావులు, భాషాభిమానులు, తెలుగుపండితులు, రాజకీయపక్షాలు ఎవరినీ సంప్రదించకుండా ఒంటెత్తుపోకడలతో నిర్ణయాలు తీసుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నా మన్నారు. నవంబర్‌ 1న రాష్ట్రావతరణదినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి తెలుగుమాట్లాడటా నికి ఎన్ని అవస్థలుపడ్డారో, తెలుగుపదాలను ఎంతచక్కగా ఉచ్ఛరించారో , ఆయన భాషపటిమ ఎలాంటిదో రాష్ట్రప్రజలంతా చూశారని కాలవ ఎద్దేవాచేశారు. తెలుగురాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌, తెలుగులో మాట్లాడలేకపోవడం తెలుగు జాతిని అవమానించినట్లేననన్నారు. 


దేశంలో తెలుగుమాట్లాడేవారు 8కోట్ల49లక్షలమంది ఉన్నారన్న కాలవ, కన్నడ తమిళభాషలను రక్షించడానికి పొరుగురాష్ట్రాల్లో ఎన్నోచర్యలు తీసుకుంటుంటే, మనప్రభుత్వం మాతృభాషను చంపేసే చర్యలకు పూనుకుందన్నారు. కేంద్ర,రాష్ట్ర విద్యాసంస్థల్లో పాఠ్యాంశమేదైనా సరే, తప్పనిసరిగా తెలుగును బోధించాలనే నిర్ణయం తెలంగాణలో తీసుకున్నారని చెప్పారు. దేశంలో 125కోట్లకుపైగా జనాభాఉంటే, అందులో కేవలం 15శాతం మందిమాత్రమే ఆంగ్లంలో మాట్లాడుతున్నారని చెప్పిన కస్తూరిరంగన్‌ నివేదికను జగన్‌ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని శ్రీనివాసులు నిలదీశారు. 15శాతం మందికూడా మాట్లాడలేని భాషను, తెలుగుభాషస్థానంలోకి తీసుకు రావాలని చూడటం జగన్‌ అవివేకానికి నిదర్శనమన్నారు. 


తెలుగుభాష మనుగడ, రక్షణకోసం, తెలుగుమాట్లాడేవారి హక్కులపరిరక్షణకోసం, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా తెలుగుదేశం తరుపున పోరాటం చేస్తామన్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఆసక్తిచూపేవారికోసం ప్రయోగాత్మకంగా ప్రభుత్వ, ఆశమ్ర పాఠశాలల్లో తమనిర్ణయాన్ని ప్రభుత్వం అమలుచేసి ఉండాల్సిందని, అలాకాకుండా నిర్బంధవిధానం తీసుకురావడం ద్వారా తెలుగుభాషను హత్యచేసేలా జీవో ఇవ్వడం నిరంకుశత్వమన్నారు. తెలుగంటే అభిమానంలేని జగన్మోహన్‌ రెడ్డి చర్యలను భాషాభిమానులు, మేథావులు, ప్రజాసంఘాలు, తెలుగుపండితులు ఖండించాలని మాజీమంత్రి విజ్ఞప్తిచేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: