ప‌బ్లిక్‌, ప్రైవేట్ సేవ‌ల్లో తేడా అనుకోవ‌చ్చు లేదా మ‌రేదైనా...అంశం అనుకోవ‌చ్చు కానీ...ఇదో భిన్న‌మైన ప‌రిణామం. భారతీయ రైల్వే తరఫున ఐఆర్‌సీటీసీ నడుపుతున్న మొట్టమొదటి ప్రైవేటు రైలు- తేజస్‌ ఎక్స్‌ ప్రెస్‌ తొలి నెలరోజుల్లోనే లాభాలు పొందింది. టికెట్ల అమ్మకాల ద్వారా 3కోట్ల 70 లక్షల రూపాయల ఆదాయాన్ని అక్టోబరు నెలాఖరు నాటికి ఈ రైలు ఆర్జించింది. ఇందులో 3 కోట్ల రూపాయలు నిర్వహణ వ్యయం పోగా.. 70 లక్షల రూపాయల లాభం వచ్చినట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి.


 
ఐఆర్‌సీటీసీ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అనేక ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. లేటుగా వస్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించనుంది.  ఈ తరహా ప్రయోగానికి తెరతీస్తున్న తొలి రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్సే కావడం గమనార్హం. ఈ రైలు గ‌త‌ అక్టోబర్‌ 4 నుంచి ఢిల్లీ – లక్నోల మధ్య పరుగులు పెడుతోంది. అనుకోని పరిస్థితుల వల్ల ఈ రైలు గంట లేటుగా వస్తే రూ. 100, రెండు గంటలు లేటుగా వస్తే రూ.250లు ప్రయాణికులకు చెల్లించనున్న‌ట్లు తెలిపింది. దీనితో పాటు ప్రయాణికులకు రూ. 25 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫ‌ర్ చేసింది. సరిపడా పత్రాలు చూపిస్తే రెండు మూడు రోజుల్లోనే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. రైల్లో ప్రయాణిస్తున్నపుడు ఒకవేళ  దోపిడీ జరిగితే రూ. లక్ష ఇవ్వనున్నట్లు  రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. రైల్లో ఉచిత టీ, కాఫీలు వెండింగ్‌ మెషీన్‌ ద్వారా ఇవ్వనుండగా, ఆర్వో మెషీన్‌ ద్వారా మినరల్‌ వాటర్‌ కూడా అందిస్తారు. 


ఈ రైల్లో  లక్నో నుంచి ఢిల్లీకి చార్జీలు ఏసీ చైర్‌ కార్‌కు రూ. 1,125, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌కు రూ. 2,310గా ఉంది. ఢిల్లీ నుంచి లక్నోకు ఏసీ చైర్‌ కార్‌ రూ. 1280 కాగా, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌లో రూ. 2,450గా ఉంది. ఈ రైలు చార్జీలు డిమాండ్‌కు అనుగుణంగా (డైనమిక్‌ ఫేర్‌) పెరుగుతాయి. విమానాల్లోలాగే, రైల్లో కూడా ప్రయాణికులకు ఆహారాన్ని అందించనున్నారు. ఈ తరహా విధానాలు ఇప్పటికే పలు దేశాల్లో అమలవుతున్నాయి. జపాన్‌లో, పారిస్‌ నగరంలో రైలు లేటయితే ప్రయాణికులకు ఓ సర్టిఫికెట్‌ అందుతుంది. దీన్ని పాఠశాలలు, కళాశాలు, ఆఫీసుల్లో చూపించి ఆలస్యానికి సహేతుక కారణాన్ని చూపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: