ఒక‌టి కాదు రెండు కాదు..ఏకంగా మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల నిధులు ఉన్నాయ‌ట. వీట‌న్నింటికీ ఓన‌ర్ ఎవ‌రో తెలియ‌ద‌ట‌. ఇంత‌కీ ఎక్క‌డంట‌రా? స్విస్ బ్యాంక్‌లో. భారత్‌కు చెందిన 12 ఖాతాలు నిద్రాణ దశలో ఉన్నాయి. ఇవి తమవేనని ఇప్పటిదాకా ఎవరూ ముందుకు రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే ఆ ఖాతాల్లోని సొమ్ము తమ ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని స్విట్జర్లాండ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.


స్విట్జ‌ర్లాండ్‌లో దాదాపు 3,500 ఖాతాలు స్విస్ బ్యాంకుల్లో నిద్రాణ స్థితిలో ఉన్నాయిప్పుడు. ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. స్విస్ చట్టాల ప్రకారం ఖాతా తెరిచిన దగ్గర్నుంచి 60 ఏండ్లదాకా ఖాతాదారుని నుంచి ఎలాంటి సమాచారం లేదా లావాదేవీలు జరుగకపోతే.. సదరు ఖాతాల వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కనీసం 500 స్విస్ ఫ్రాంక్స్ లేదా విలువ తెలియని ఆస్తులుంటే వాటి కోసం క్లయిములను ఆహ్వానించాలి. నిజానికి 2015 డిసెంబర్‌లో దాదాపు 2,600 నిద్రాణ ఖాతాలను బహిర్గతం చేశారు. వీటిల్లో రూ.300 కోట్లకుపైగా (దాదాపు 45 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్) నగదు నిల్వలున్నాయి. ఇవన్నీ కూడా 1955 నుంచి నిశ్చలంగా ఉన్నాయి. అలాగే సుమారు 80 సేఫ్టీ అన్‌క్లయిమ్డ్ డిపాజిట్ బాక్స్‌లూ వాటి యజమానులు, వారి వారసుల కోసం బహిర్గతం చేసినట్లు స్విస్ వర్గాలు తెలిపాయి.


కాగా, ఇందులో బ్రిటిష్ పాలన నాటి ఖాతాలూ ఉండటం గమనార్హం. ఇక గత ఆరేళ్లుగా ఎవరి నుంచి ఈ ఖాతాలు మావేనన్న సమాచారం రాలేదని స్విస్ అధికారులు చెబుతున్నారు. దీంతో కొన్నింటి కాలపరిమితి ఈ నెల, వచ్చే నెలతో తీరిపోనుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 15తో లీలా తాలుక్‌దార్, ప్రమతా ఎన్ తాలూక్‌దార్ ఖాతాల కాలపరిమితి ముగియనుందని, అలాగే కిశోర్ లాల్, మోహన్ లాల్, చంద్రలత ప్రణ్‌లాల్ పటేల్ ఖాతాలకున్న గడువు డిసెంబర్‌తో అయిపోతుందని, ఈలోగా ఆస్తులు, నగదు కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని స్విస్ అధికారులు పేర్కొన్నారు. కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా)కు చెందిన ఇద్దరు, డెహ్రాడూన్‌కు చెందిన ఒక్కరు, బాంబే (ప్రస్తుతం ముంబై)కు చెందిన ఇద్దరు ఈ జాబితాలో ఉండగా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో స్థిరపడినవారి పేర్లూ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: