అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయ రెడ్డి హత్య కేసు రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ అధికారులు అందరూ ప్రజలను చూస్తే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పెట్రోల్ పోసి తగలబెడుతం  అంటూ కొంత మంది ప్రజలు అధికారులకు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇది తెలంగాణ జిల్లాలోనే  కాదు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ జిల్లాకు కూడా పాకిపోయింది. అక్కడ కూడా ప్రజలు అధికారులు ఏవైనా లంచం అడిగితే పెట్రోల్ పోసి తగలబెడతాం అంటూ హెచ్చరికలు  చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. 

 

 

 

 అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు తమకు నెల పింఛన్  అందకపోవడంతో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. తమకు ఈనెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ ను  నిలదీశారు. ఈ నెల పెన్షన్ ఇవ్వమని వచ్చే నెల నుంచి ఇస్తామంటూ పంచాయతీ కార్యదర్శి సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పెన్షన్ దారులు ... వచ్చే నెల నుంచి పింఛన్ అందించకపోతే పెట్రోలు పోసి తగలబెడతాం అంటూ  బెదిరించారు. 

 

 

 

 అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేషు,  శివమ్మ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే శివమ్మ అనే మహిళ ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో... ఆమె చేతిలో కొడవలి ఉండడంతో ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శివమ్మా  చేతిలో కొడవలి  ఉండటంతో అధికారులు కాస్త భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు శివమ్మ ఎంపీడీవో కార్యాలయానికి కొడవలితో ఎందుకు వెళ్ళింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: