పెట్రోల్ అమ్మకంపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనాల్లో నేరుగా పెట్రోల్ పోయించుకోకుండా.. బాటిళ్లలలో.. డబ్బాలలో..పెట్రోల్ పోయడాన్ని నిషేధించింది. రాష్ట్రంలోని ఏ పెట్రోల్ బంకుల్లోనూ బాటిళ్లలో పెట్రోలును అమ్మరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై సర్కారు ఆంక్షలు విధించింది.


తెలంగాణలోని అన్ని పెట్రోలు బంకుల్లో ఈ మేరకు బోర్డులు ఏర్పాటయ్యాయి. వాస్తవానికి బైక్ ఎక్కడో ఆగిపోతేనో, స్నేహితుడి బైక్ రోడ్డుపై నిలిచిపోతేనో, బాటిల్ తీసుకుని వచ్చి పెట్రోల్ పోయించుకుని వెళుతుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో తెలంగాణలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్ ను వాడుతున్నారు.


ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డిని, ఆమె కార్యాలయంలోనే దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఆ తర్వాత కూడా రెండు, మూడు పెట్రోల్ బెదిరింపుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. బాటిళ్లలో పెట్రోల్ విక్రయించరాదని తేల్చి చెప్పింది.


దీంతో బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్ అమ్మడం నిషిద్ధం అన్న బోర్డులు వచ్చేశాయి. టూ వీలర్లు అయినా, ఫోర్ వీలర్లు అయినా, వాహనం తెస్తేనే పెట్రోల్ పోస్తారన్నమాట. ఈ మేరకు తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని బంకుల యజమానులు తేల్చి చెబుతున్నారు. తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగానూ.. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యలు... బెదిరింపులు పెరుగుతూనే ఉన్నాయి.


పెట్రోల్ నేరుగా బాటిళ్లలో దొరకడంతో ఇలాంటి వారి పని సులువు అవుతోంది. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం.. కొంతవరకూ వీటిని నిరోధించగలుగుతుందనే చెప్పాలి. కాకపోతే.. మార్గమధ్యంలో ఎక్కడైనా బండి ఆగిపోయివారికి మాత్రం తోపుడు తిప్పలు తప్పవన్నమాట. అందుకే ఏటైనా వెళ్లే ముందు బండిలో సరిపోయినంత పెట్రోలు ఉందో లేదో చూసుకోండి. మరి కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం తరహాలోనే మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ నిబంధన అమలు చేస్తాయో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: