ముందు దీక్ష తేదీని ప్రకటించేశారు. ఇపుడు వివిధ పార్టీల మద్దతుకోసం పాకులాడుతున్నారు. ప్రతిపార్టీ దగ్గరకు వ్యక్తిగతంగా వెళ్ళి తన దీక్షలో పాల్గొనేలా నేతలను ఒప్పించాలంటూ కొందరు సీనియర్  నేతలకు స్పష్టంగా ఆదేశించారు. నిజానికి చంద్రబాబుకు మద్దతుగా నిలబడటానికి ఏ పార్టీ కూడా సిద్దంగా లేదు. ఇపుడు దీక్షను సక్సెస్ చేయటం ఎలాగన్న విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వ్యవహారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకునే అలవాటు చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. తాను నిర్ణయం తీసేసుకుని తర్వాత అందరితో చర్చిస్తారు. ఈ పద్దతి తన పార్టీలో అయితే చెల్లుబాటు అవుతుంది. మరి ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలంటే ఎలా సాధ్యమన్న కనీస ఆలోచన కూడా ఉండదు.  ఇసుక కొరతకు నిరసనగా ఈనెల 14వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ లో 12 గంటలపాటు దీక్ష చేయాలన్న నిర్ణయం కూడా ఇలా జరిగిందే.

 

ఇసుక కొరత సమస్య బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో చంద్రబాబు దీక్ష గురించి మాట్లాడలేదు.  గడచిన పది రోజులుగా ఇసుక తవ్వకాలు, సరఫరా బాగా పెరిగింది. వరదలు, వర్షాల కారణంగా ఇసుకను తవ్వలేకపోయింది ప్రభుత్వం. వాస్తవాలు తెలిసినా చంద్రబాబు అండ్ కో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడిన విషయం అందరూ చూస్తున్నదే.

 

ఇసుక కొరత ఎక్కువున్న కాలంలో రోజుకు 30 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. అయితే వర్షాలు, వరద ప్రభావం తగ్గటంతో ఇపుడు రోజుకు లక్ష టన్నులకు పైగా సరఫరా అవుతోంది. అంటే ఇసుక కొరత చాలా వరకూ తగ్గినట్లే అనుకోవాలి. ఇలాంటి నేపధ్యంలో చంద్రబాబు దీక్షకు కూర్చోవటమే విచిత్రంగా ఉంది.

 

ముందుగా వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించినా పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఇపుడు పార్టీ నేతలకు చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టాల్సిందేనంటూ ఆదేశించారు. దాంతో నేతలంతా కిందా మీదా పడుతున్నారు ఇపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: