ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తెలంగాణను ఓ విషయంలో మెచ్చుకున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా.. ప్రజాపోరాటాల విషయంలో. అవును..అక్కడ తెలంగాణ ఆర్టీసీని కాపాడుకునే క్రమంలో అన్ని పార్టీలు, నాయకులు, ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయని చంద్రబాబు మెచ్చుకున్నారు. అదే స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ నాయకుల్లోనూ రావాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు.


అందుకు తాను నవంబర్ 14న చేపట్టిన దీక్ష వేదిక కావాలంటున్నారు. ప్రభుత్వం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇప్పించేందుకే తన దీక్ష అని ఆయన స్పష్టం చేసారు. ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఇసుక కొరత ఇక్కడే ఎందుకు వచ్చిందని చంద్రబాబు నిలదీశారు.


వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు వందలాది లారీల ఇసుకను యధేచ్ఛగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న వారి పట్ల మానవత్వాన్ని మరచి మంత్రులు అపహాస్యం చేయడం తగదని చంద్రబాబు అంటున్నారు.


12 గంటల ఇసుక దీక్షకు ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్‌టిసి సమస్యపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నాయని.. ఏపీలోనూ అదే తరహాలో ఇసుక సమస్యపై పోరాడాలంటున్నారు చంద్రబాబు. ఇసుక కొరత వల్ల నష్టపోతున్న 125 వృత్తుల వారు అంతా కలసి ఉద్యమం చేయాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు.


తాను ఈ నెల 14న తలపెట్టిన దీక్షకు వీరంతా తరలిరావాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఏపీ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని మార్చటంవల్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృత్రిమ కొరత ఏర్పడిందని చంద్రబాబు మండిపడ్డారు. భార్యా పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామని మొత్తం 40 మందికి బలవన్మరణాల పాలయ్యారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: