ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ వివాదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దెబ్బ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు బాగా గట్టిగానే తగిలినట్లుంది. ఇంగ్లీషు మీడియం వద్ద తెలుగు మీడియమే ముద్దు అంటూ వెంకయ్యానాయుడు, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లోమీడియాతో పాటు చాలామంది జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

ఈ నేపధ్యంలోనే జగన్ మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి వాళ్ళ పిల్లలు, మనవళ్ళు ఏ స్కూళ్ళల్లో చదువుతున్నారో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్ ఎప్పుడైతే బహిరంగంగా సూటిగా ప్రశ్నించారో వాళ్ళ నోళ్ళని మూతపడిపోయాయి.

 

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతు తనతో పాటు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడి లాంటి వాళ్ళంతా తెలుగుమీడియంలోనే చదువుకున్నట్లు డొంకతిరుగుడుగా మాట్లాడారు.  ఇక్కడ సమస్య వెంకయ్య అండ్ కో ఏ మీడియంలో చదవారని కాదు. తమ పిల్లలు, మనవళ్ళు ఏ స్కూళ్ళల్లో చదవారు లేకపోతే చదువుతున్నారని మాత్రమే.

 

వెంకయ్య అండ్ కో చదువుకున్నపుడు అంటే సుమారు 50 ఏళ్ళ క్రితం ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు అందరికీ అందుబాటులో లేకపోయుండచ్చు. అందుకనే చాలామంది ప్రముఖులు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. కానీ ఇపుడు పరిస్ధితి అలాలేదు. మారుమూల పల్లెల్లో కూడా వీధికో ఇంగ్లీషు మీడియం స్కూలు కనబడుతోంది.

 

అందుకనే ఎక్కువమంది తల్లి, దండ్రులు అప్పులు చేసైనా సరే తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలోనే చదివించాలని కోరుకుంటున్నారు. ఇక వెంకయ్య సంగతిని పక్కన పెడితే నారా లోకేష్ ఇపుడు దేవాన్ష ఎక్కడ చదువుతున్నారో అందరికీ తెలిసిందే. అలాగే పవన్ తన పిల్లలను కూడా ప్రముఖ అంతర్జాతీయ  ఇంగ్లీషు మీడియం స్కూల్లోనే చదివిస్తున్నారు.  జగన్ సూటిగా వేసిన ప్రశ్నకు వాళ్ళెవరూ సమాధానం చెప్పలేకపోయారు. అందుకనే జగన్ కు తెలుగు రాదనే అడ్డదిడ్డమైన వాదనలు తెరపైకి తెస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: