ప్రజలు తినే ఆహారంలో స్వచ్ఛత ఎంత అంటే.. ఇది సమాధానం లేని ప్రశ్నే. ఎందుకంటే మార్కెట్ దొరికే కూరగాయలు, మాంసం, చికెన్.. ఇలా ఏది తీసుకున్నా కల్తీ లేకుండా ఉండటం లేదు. వీటి స్వచ్ఛతకు ప్రామాణికాలు ఉన్నా పాటించే వారు లేరు. సంబంధిత అధికారులు కొన్ని సందర్భాల్లో చేసిన తనిఖీలు ఫలితాలనిస్తున్నా వీటికి శాస్వతంగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

 


ఇటివల విజయవాడలోని ఓ రెస్టారెంట్ లో పాడైపోయిన చికెన్ తో బిర్యానీ తయారు చేస్తూండటాన్ని అధికారులు తమ తనిఖీల్లో కనుక్కున్నారు. రెస్టారెంట్ ను సీజ్ చేశారు. అప్పటివరకూ తినేవారికి తెలీదు తాము కల్తీ ఆహారం తీసుకుంటున్నామని. నెల క్రితం నెల్లూరులో చికెన్ అమ్మకాల్లో జరిగిన కల్తీ ఓ సంచలనం రేపింది. రెస్టారెంట్ నిర్వాహకులు నిల్వ ఉండిన చికెన్ తో బిర్యానీలు చేశారు. అంతే కాకుండా చికెన్ అమ్మకాలు సాగించే షాపుల్లో కూడా కుళ్లిపోయిన చికెన్, ఫ్రిజ్ లో పెట్టిన చికెన్, పురుగులు పట్టిన చికెన్ ను ప్రజలకు అమ్మేశారు. ఇవన్నీ ప్రముఖ పత్రికల్లో వచ్చినవే. సంబంధిత అధికారుల విస్తృత తనిఖీల్లో ఇవన్నీ బయటపడ్డాయి. హైదరాబాద్ లో బిర్యానీల్లో ఉపయోగించే నూనెను జంతువుల కళేబరాల కొవ్వు నుంచి తయారు చేసే అక్రమార్కులకు అధికారులు పట్టుకోవటం చూశాం. రాజస్థాన్ నుంచి చెన్నైకు ప్రత్యేక ప్యాకేజీల్లో సరఫరా చేసిన వెయ్యి కేజీల కుక్క మాంసాన్ని చెన్నై రైల్వే స్టేషన్ లో పట్టుకున్న సంగతి కూడా తెలిసిందే.

 


ఇంత ఆహార కల్తీ జరుగుతుంటే వాటిని అడ్డుకునేదెవరు. నిబంధనలు కఠినతరం చేయాల్సిన అధికారులు నామమాత్రపు ఫైన్ లు వేస్తుండటంతో అక్రమార్కులకు భయం లేకుండా పోతోంది. షాపులు సీజ్ చేయటం, లైసెన్సులు రద్దు చేయటం, కఠిన శిక్షలు విధించటం.. చేస్తే కొంతమేరయినా ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: