ఏపీ రాజకీయంలో కొత్త యుద్ధం మొదలైంది. వైసీపీ తన సంప్రదాయ శత్రువైన టీడీపీ కంటే జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. రెండు పార్టీల నేతలు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో ఇప్పుడు యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఏకంగా ముఖ్యమంత్రి జగనే... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నేరుగా విమర్శలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  


జనసేనను ఇప్పటివరకూ ఒక తోక పార్టీగానే పరిగణిస్తూ వచ్చింది వైసీపీ. వీలున్నప్పుడల్లా జనసేన టీడీపీకి ఉప పార్టీ లాంటిదనీ,  ఆ రెండు పార్టీలు ఒకే దగ్గరున్న ముక్కలని విమర్శిస్తూ వచ్చారు వైసీపీ నేతలు. వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఆరు నెలల వరకు పల్లెత్తు మాట అనని చెప్పిన పవన్ కల్యాణ్...మూడు నెలలకే బాణాలు ఎక్కుపెట్టారు. ఇసుక కొరతపై ఈ మధ్య విశాఖలో జరిపిన లాంగ్ మార్చ్‌తో జనసేన తన ఉనికిని ప్రదర్శించింది. సహజంగా రాజకీయ అంశాలే మాట్లాడే జనసేనాని వైసీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అలాగే జగన్‌ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వారం వారం కోర్టుకెళ్లే నేతను ఎన్నుకోవడం మన తప్పని పవన్ చేసిన కామెంట్ తగలరాని చోటే తగిలింది.  


జనసేన విషయంలో వైసీపీ మొదటి నుంచి స్థిరమైన అభిప్రాయాలు జనంలోకి తీసుకెళ్లింది. జనసేన-పవన్ కల్యాణ్‌కు తాము గుర్తించేంత స్థాయి లేదనీ... వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకోవాల్సినంత అవవసరం లేదన్నట్టుగా పైకి వ్యవహరిస్తూ వస్తోంది. కానీ తెలుగు దేశం కన్నా... జనసేనే ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేయడం, లాంగ్‌ మార్చ్ లాంటి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టడంతో అదే స్టైల్‌లో కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది వైసీపీ. ఇంగ్లీష్ మీడియం చదువుల విషయంలో కూడా... జనసేన ప్రభుత్వాన్ని విమర్శించడంతో ఏకంగా ముఖ్యమంత్రి జగన్... జనసేనానిని డైరెక్ట్ అటాక్ చేశారు. పవన్ కళ్యాణ్ ను సినిమా వాడిగాడే ప్రస్తావించడం గమనించాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ గా ఎటాక్ చేయడానికి పార్టీలోని కాపు నాయకులని ప్రయోగిస్తూ ఉంటుంది వైసీపీ. అయితే ఈసారి ఏకంగా సీఎం జగన్... పవన్‌ పై విమర్శలు గుప్పించడంతో ఈ రెండు పార్టీల మధ్య వార్ టూ సైడ్స్‌గా మారిందని చెప్పొచ్చు.  మున్ముందు ఈ పార్టీలు మంచి మసాలా రాజకీయాన్ని పండించబోతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: