మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపదని అందరూ అంచనా వేశారు. కానీ ఫలితాల తర్వాత ఆ పార్టీ కీలకంగా మారుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ కింగ్ మేకరైంది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే మహా రాజకీయాన్ని నిర్దేశించనుంది. 


మహారాష్ట్రలో చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్ కు ఇప్పుడు అనూహ్యమైన అవకాశం వచ్చింది. మహారాష్ట్ర కింగ్ ఎవరో హస్తం పార్టీ తేల్చనుంది. సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. అంతకుముందు కీలక పరిణామాలు జరిగాయి. శరద్ పవార్ తో భేటీ అయిన ఉద్ధవ్ థాక్రే.. సోనియాకు ఫోన్ చేశారు. శివసేన సర్కారుకు మద్దతివ్వాలని కోరారు. దీంతో సోనియా వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహించారు. 


ఒకప్పుడు బాలాసాహెబ్.. వాద్రా కుటుంబాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే పార్టీతో శివసేన ఎలా పొత్తు పెట్టుకుందని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు శివసేనకు మద్దతివ్వడంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాల్లో వ్యక్తమౌతున్నాయి. శివసేనతో పొత్తు పెట్టుకుంటే సర్వనాశనం తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం శివసేనకు మద్దతివ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 


వర్కింగ్ కమిటీలో కూడా శివసేనతో పొత్తుపై వాడివేడి చర్చ జరిగింది. శివసేనకు మద్దతిస్తే.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయంపైనా డిస్కషన్ నడిచింది. కాంగ్రెస్ కు ఉన్న లౌకిక పార్టీ అనే ముద్ర పోతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టు సమాచారం. సోనియా గాంధీ కూడా శివసేనకు మద్దతివ్వాల్సి వస్తే.. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గవర్నర్ అనూహ్యంగా ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో.. శివసేన డైలమాలో పడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: