మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కావాలన్న శివసేన అభ్యర్థనను తిరస్కరించిన గవర్నర్.. మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ఆహ్వానించారు. ఇప్పుడు ఎన్సీపీ ఏం చేస్తుంది, శివసేన నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠకు దారితీస్తోంది. 


మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అందరూ భావించారు. ఉద్ధవ్ థాక్రే శరద్ పవార్ తో భేటీ కావడం, సోనియాతో ఫోన్ లో మాట్లాడటంతో చర్చలు కొలిక్కివచ్చాయనే వాదన వినిపించింది. కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. డెసిషన్ పెండింగ్ పెట్టడంతో సరైన సంఖ్యాబలం లేకుండానే శివసేన గవర్నర్ ను కలిసింది. తమకు రెండు రోజులు టైమ్ ఇస్తే సర్కారు ఏర్పాటు చేస్తామని అభ్యర్థించింది. అయితే గవర్నర్ శివసేనకు షాకిచ్చారు. వారి అభ్యర్థనను తిరస్కరించారు. మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇప్పుడు ఎన్సీపీ సర్కారు ఏర్పడాలన్నా శివసేన మద్దతు తప్పనిసరి. దీంతో శరద్ పవార్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు శివసేన ఏం చేస్తుందనేది కూడా కీలకమే. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతిస్తాయనే ఆశతో కేంద్రంలో మంత్రి పదవిని కూడా వదులుకున్న శివసేన భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతోంది. 


ఇటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణానికి తాము మద్దతిచ్చేది లేదని ఇద్దరు ఎమ్మెల్యేల బలమున్న ఎంఐఎం పార్టీ తేల్చిచెప్పింది. అటు బీజేపీ మాత్రం బలమైన ప్రతిపక్షంగా ఉండటానికి రెడీ అయిపోయింది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలాల్సి ఉంది. మొదట అతిపెద్ద పార్టీగా బీజేపీకి అవకాశం ఇచ్చిన గవర్నర్.. తర్వాత శివసేనను ఆహ్వానించారు. ఆ పార్టీ కూడా గడువు కోరడంతో.. ఎన్సీపీకి ఛాన్సిచ్చారు. గవర్నర్ అనూహ్యమైన నిర్ణయాల వెనుక కేంద్రం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అందరికీ ఆహ్వానం పంపినట్టు పంపి.. అంతిమంగా ప్రెసిడెంట్ రూల్ దిశగా అడుగులు పడుతున్నాయనేది శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అనుమానం. 



మరింత సమాచారం తెలుసుకోండి: