మహారాష్ట్రలో సూపర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో తమకు తగినంత సమయం ఇవ్వలేదన్న కారణంతో  శివసేన సుప్రింకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు అవుతున్నా ఇంత వరకూ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవని తేలిపోయింది.

 

మహారాష్ట్ర గవర్నర్ ముందుగా 105 సీట్లున్న బిజెపికి అవకాశం ఇచ్చారు. అయితే బిజెపి చేతులెత్తేసింది. తర్వాత 56 సీట్లు గెలుచుకున్న శివసేను పిలిచారు. ఈ పార్టీ కూడా ముందు ప్రభుత్వం ఏర్పాటుకు మొగ్గు చూపినా తర్వాత వెనక్కు తగ్గింది. తాజాగా ఎన్సీపీని పిలిచారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో చొరవ తీసుకునేందుకు ఎన్సీపీకి గవర్నర్ ఈరోజు రాత్రి 8.3 గంటల వరకూ డెడ్ లైన్ విధించారు.

 

అయితే ప్రభుత్వ ఏర్పాటులో తమకు అవకాశం ఇవ్వాలని శివసేన మళ్ళీ  గవర్నర్ ను కోరింది. అందుకు గవర్నర్ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటులో బిజెపికి అన్నిరోజులు అవకాశం ఇచ్చిన గవర్నర్ తమకు మాత్రం ఇవ్వలేదని ఆరోపిస్తు సుప్రింకోర్టులో కేసు వేసింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గవర్నర్ ఎన్ని రోజులు సమయం ఇచ్చినా శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకంటే 44 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ శివసేనకు మద్దతు ఇవ్వటానిక ఇష్టపడటం లేదు.  కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపి శివసేనకు మద్దతు ఇవ్వటానికి అంగీకరించినా సోనియాగాంధి మాత్రం ఇష్టపడటం లేదు. దాంతో శివసేన ఆశలు అడియాసలయ్యేట్లే ఉన్నాయి.

 

ఎన్సీపికి మద్దతు ఇవ్వటంలో తమకు అభ్యంతరం లేదని కాబట్టి ముఖ్యమంత్రి పదివి ఎన్సీపికే ఇవ్వాలన్న కాంగ్రెస్ షరతుకు శివసేన అంగీకరించటం లేదు. దాంతో శివసేనకు కాంగ్రెస్ మద్దతు ఎండమావిలాగ అయిపోయింది. ఈ కారణంతోనే ఎన్నిరోజులు అవకాశం ఇచ్చినా శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు సాధ్యం కాదని తేలిపోయింది. ఈ నేపధ్యంలోనే శివసేన గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ సుప్రింకోర్టును ఆశ్రయించటం సూపర్ ట్విస్ట్. మరి కోర్టు ఏ చెబుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: