మహారాష్ట్ర రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. కానీ బీజేపీకి 105 స్థానాలు మాత్రమే వచ్చాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్‌ను కలిసి తెలిపింది. బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో.. ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8:30 గంటల వరకు ఎన్సీపీకి గవర్నర్ గడువిచ్చారు. అదే స‌మ‌యంలో....మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే....ఏం చేయాలో శివ‌సేన సిద్ద‌మైంది.


ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న శివసేనకు గడువు విధించిన గవర్నర్ కోశ్యారీ ఇవాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి విధించారు.ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత‌ శరద్ పవార్ సోనియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్ ముంబయికి పయనమయ్యారు. ఈ రోజు సాయంత్రం శరద్ పవార్‌తో పాటు రాష్ర్ట కాంగ్రెస్ నాయకులతో వారు చర్చించనున్నారు.మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు మహారాష్ర్టలో కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం ఉంది.


ఇదిలాఉండ‌గా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీల‌క‌ అంశంపై చర్చించినట్లు సమాచారం. న్యాయపరమైన అంశాలను పరిశీలించి...మహారాష్ర్టలో రాష్ర్టపతి పాలన విధించేందుకు కేంద్రానికి ఆ రాష్ర్ట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ర్టలో రాష్ర్టపతి పాలన విధిస్తారని వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో శివసేన పార్టీ అప్రమత్తమైంది. ఒక వేళ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు శివసేన సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను సలహా కోరినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: