ఒక నిర్లక్ష్యం తాలూకూ మూల్యం కొన్ని ప్రాణాలు. ఈ మధ్య మనం చూస్తున్న, వింటున్న సంఘటనలు ఇలాంటివే. ఇకపోతే తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండగా దీనికి బాద్యులు ఎవరన్న ప్రశ్నవస్తే రైల్వే అధికారులు చాలా సమాధానాలు చెబుతారు. కాని ఏం చెప్పినా అవి మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నది నిజం. ఇక ఈ ప్రమాదాలకు మరో కారణం డేంజర్‌ సిగ్నల్‌ దాటి లోకో పైలెట్లు రైలును నడుపుతుండటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండటం..


ఇక తాజాగా జరిగిన కాచిగూడ ఎంఎంటీఎస్‌ ప్రమాదం ఇలాంటిదే అంటారు. ఇకపోతే మెట్రోలో మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా అత్యాధునికమైన ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌(ఏటీపీ) విధానం అమలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవస్ద ఎంఎంటీఎస్‌లో ఉంటే కాచిగూడ ప్రమాదం జరిగేది కాదు అంటున్నారు. ఈ ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ వల్ల ఊపయోగమేంటంటే ముందుగా వెళుతున్న, ఎదురుగా వస్తున్న రైళ్లను ఢీకొనకుండా కొంత దూరం నుంచే గుర్తించి నిరోధిస్తుంది.


ఇక్కడ  మెట్రో రైలు విధానాన్ని గమనిస్తే అవి ఎక్కువగా ఒకే ట్రాక్‌లో వెళుతుంటాయి. చివరి స్టేషన్‌ లో మాత్రమే పట్టాలు మారుతాయి. ఇలా కాకుండా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కూడా మధ్యలో పట్టాలు మారే వీలుంది. రెండే నిమిషాల వ్యవధిలోనూ ఒకదాని వెంట ఒకటి ఒకే ట్రాక్‌లో వెళ్లే మెట్రోలు కూడా ఢీకొనే ప్రమాదం లేకపోలేదు.


కాని అందుకు ఆస్కారం లేకుండా కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌(సీబీటీసీ) అధునాతనమైన ట్రైన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను హైదరాబాద్‌ మెట్రో దేశంలోనే మొదటగా ప్రవేశపెట్టింది.  ఫ్రాన్స్‌కు చెందిన థాలెస్‌ కంపెనీ ఈ సాంకేతికత పరిజ్ఞానాన్ని అందించింది. ఇవి ఎప్పటికప్పుడు రైళ్ల గమనాన్ని ఆగకుండా ప్రసారం చేస్తుంటాయి.


మన బాషలో చెప్పాలంటే  రైళ్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ తమ మధ్య దూరాన్ని నియంత్రించుకుంటాయి. ఈ మెట్రో రైలు వ్యవస్థను ఉప్పల్‌ డిపోలోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఓసీసీ) ఈ ప్రక్రియతో నియంత్రిస్తుంది. ఇలాంటి వ్యవస్థను కూడా ఎంఎంటీఎస్‌ లో ప్రవేశ పెడితే ప్రమాదాలు నివారించవచ్చన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు అధికారులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: