తెలంగాణ‌ రాష్ట్రంలో...వ‌చ్చే నెల‌లో కొత్త పండుగ జ‌ర‌గ‌నుంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. వచ్చేనెలలో 1.35 లక్షల ఇండ్లల్లో సామూహిక గృహప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిల్లో 36 వేల ఇళ్లు ఇప్ప‌టికే పూర్తికాగా, 99 వేల ఇళ్ల‌ నిర్మాణం చివరిదశకు చేరుకుంది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కేటాయింపులో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తుండ‌టం, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తున్న నేప‌థ్యంలో...అర్హుల‌కే ద‌క్క‌నున్న‌ట్లు చెప్తున్నారు. 


ఈ నూత‌న ప్రాంగ‌ణాల‌ను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఈ నూత‌న ఇండ్లకు మిషన్‌ భగీరథ నల్లాలు ఏర్పాటుచేయడంతోపాటు, ఆవరణలో పచ్చని మొక్కలతో సర్వాంగ సుందరంగా తయారయ్యా యి. 99,554 ఇండ్లు 95 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. మిగిలిన 5 శాతం అంటే ఇండ్ల ముందు కాల్వలు, లైట్లు ఏర్పాటు చేయడం వంటి చిన్న పనులు మిగిలి ఉన్నాయి. వీటితోపాటుగా కొన్ని జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పనులు 80 శాతం పూర్తిచేశారు.


తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 32 వేల ఇండ్లను పేదలకు పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2,83,401 ఇండ్లను కేటాయించి, వాటికి పరిపాలనా అనుమతులు జారీచేసింది. 1,99,353 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆయా కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్‌ చేశారు. వీటిలో 1,79,078 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. 32 వేల ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించగా.. ఈ నెల 1వ తేదీ నాటికి 36,136 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు ఏడువేల కోట్లు ఖర్చుచేసింది.  మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిర్మ ల్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేటతోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: