ఏపీ కేపిటల్ విషయంలో ఏం జరగబోతోంది..? ప్రస్తుత ప్రాంతంలోనే రాజధాని కొనసాగుతుందా..? లేక వేరే ప్రాంతానికి మారుతుందా..? రాజధాని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది..? ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తి చేసుకున్న జీఎన్ రావు కమిటీ ఏం చెప్పబోతోంది..? మరోవైపు సింగపూర్ కన్సార్షియం రద్దు కావడం దేనికి సంకేతం.. ? ప్రస్తుతం ఏపీలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.


ఏపీ రాజధాని ఎక్కడా అనే అంశంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదనే చెప్పాలి. రాజధాని విషయంలో తమ ప్రభుత్వం ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదని మంత్రి బొత్స చెబుతున్నారు. రాజధాని విషయంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని బొత్స అంటున్నారు. రాజధానిని తేల్చే పనిలో నిపుణుల కమిటీ బిజీబిజీగా ఉంది. ప్రభుత్వం, వివిధ శాఖల నుంచి అవసరమైన సమచారాన్ని తెప్పించుకుంటోంది. వాటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే గత నెల 28 నుంచి ప్రజలు.. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది కమిటీ. సుమారు 25 వేల మేర వినతులు వచ్చినట్టు సమాచారం. రాజధాని ఎక్కడ ఉండాలి.. ? అనే అంశం మొదలుకుని రాష్ట్రాభివృద్ధి వరకు వివిధ వర్గాల నుంచి భారీగా వినతులు వచ్చినట్టు తెలుస్తోంది. హైకోర్టు అంశం కూడా కమిటీ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. 


జీఎన్ రావు కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఇంకా మూడు వారాల గడువు ఉన్న క్రమంలో.... వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించుకుంటూనే.. జిల్లాల పర్యటనలు చేపట్టి మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో జీఎన్ రావు కమిటీ నివేదిక ఏ విధంగా ఉండబోతోందనే చర్చ రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది. ప్రస్తుత ప్రాంతంలోనే రాజధానిని కొనసాగించమని కమిటీ నివేదిక ఇస్తుందా.. ? లేక వేరే ప్రాంతానికి మార్చమని సూచిస్తుందా.. అనే అంశం ఉత్కంఠగా మారింది. జీఎన్ రావును కలిసిన తర్వాత రాజధాని రైతులు భరోసాతో ఉన్నప్పటికీ.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారంతో... రాజధాని విషయంలో సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకునే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయనే భావన ఏర్పడుతోంది. 


ఇక ఇదే సమయంలో మరో కీలక పరిణామం రాజధాని విషయంలో జరిగింది. గత ప్రభుత్వం 2017లో సింగపూర్ ప్రభుత్వం కుదుర్చుకున్న స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించిన ఒప్పందం రద్దైంది. ఈ ఒప్పందాన్ని ఏపీ సర్కార్ రద్దు చేసుకోవడానికి పెద్ద కారణమే ఉంది. గత ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధికి 1691 ఎకరాలు కేటాయించగా.. అందులో 170 ఎకరాలు నదీతీరంలో ఉంది. నదీ తీరంలో ఉండడంతో అక్కడ నిర్మాణాలు చేపట్టే విషయంలో సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులివ్వకపోవచ్చనేది అనుమానాలను సింగపూర్ ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ఉన్నప్పుడే వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చకుండా.. కేవలం సింగపూర్ సంస్థలతో స్టార్టప్ ఏరియా శంకుస్థాపనకే పరిమితం అయింది నాటి ప్రభుత్వం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్టప్ ఏరియాలో ఏ ఒక్క పనిని సింగపూర్ కన్సార్టియం చేపట్టలేదు. ఇదే సమయంలో ఏపీలో కొత్త ప్రభుత్వం రావడం.. ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా మారడంతో సింగపూర్ కన్సార్టియం రద్దు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే... రాజధాని భవితవ్యం అంతా జీఎన్ రావు కమిటీ ఇచ్చే నివేదిక మీదే ఆధారపడి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: