అవును క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది.  ప్రభుత్వం ఏర్పాటులో నాలుగు ప్రధాన పార్టీలు విఫలమవ్వటంతో రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయటం కేంద్రప్రభుత్వం కూడా చకచక రాష్ట్రపతి పాలన విధించటం జరిగిపోయింది. సిఎం కుర్చీ విషయంలో మిత్రపక్షాలు బిజెపి+శివసేనలు కాస్త పట్టువిడుపు ప్రదర్శించుంటే ఎప్పుడో ప్రభుత్వం ఏర్పాటైఉండేది.

 

అదే సమయంలో ఎన్సీపి+కాంగ్రెస్ లు శివసేనకు మద్దతు ఇచ్చున్నా ప్రభుత్వం ఏర్పాటయ్యేదే. చివరి నిముషంలో శివసేనకు కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వటంతో సంక్షోభం బాగా ముదిరిపోయి చివరకు రాష్ట్రపతి పాలన విధించాల్సొచ్చింది. సరే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాలేదన్న ఒక్క చింత తప్ప బిజెపికి ఇతరత్రా ఏమీ నష్టం లేదనే చెప్పాలి.

 

ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధించినా  వ్యవహారాలు మొత్తం  కేంద్రం చేతిలోనే ఉంటాయి. కేంద్రం అంటే మళ్ళీ బిజెపినే అన్న విషయాన్ని మరచిపోకూడదు.  కాబట్టి గవర్నర్ పాలన పేరుకు మాత్రమే కానీ పెత్తనమంతా తెరవెనుక నుండి బిజెపిదే అన్నది వాస్తవం.  పైగా  గవర్నర్ వ్యవస్ధ మొత్తం కేంద్రం చెప్పుచేతల్లోను ఉంటుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

 

వివిధ రాష్ట్రాల్లో అంటే సిక్కిం, మిజోరం లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను గెలుచుకోవటంలో వెనకబడినా అధికారంలోకి మాత్రం బిజెపినే వచ్చింది. దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉండటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నరేంద్రమోడి, అమిత్ షా లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నపుడు మిగిలిన పార్టీలను బతకనిస్తారని అనుకునేందుకు లేదు.

 

మోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారాలే ఇందుకు నిదర్శనం. కాబట్టి మహారాష్ట్రలో ప్రత్యక్షంగా అధికారం లేరన్న బాధ తప్ప అధికారం చెలాయించటంలో బిజెపికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎంతకాలం రాష్ట్రపతి పాలన విధిస్తారో చెప్పలేం. ఈ లోగా మిగిలిన పార్టీల్లోని ఎంఎల్ఏలను తన దారికి తెచ్చుకోవటానికి కమలంపార్టీకి కావాల్సినంత సమయం దొరికిందన్నది మాత్రం వాస్తవం.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: