‘ 25కు 25 ఎంపీలు ఇవ్వండి...కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకోస్తా ’ ఇది ఎన్నికల సమయంలో జగన్ చెప్పిన మాటలు. అయితే జనం అందుకు తగ్గట్టుగానే వైసీపీకి 22 మంది ఎంపీలని ఇచ్చారు. కానీ కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రత్యేక హోదా ఆశలు మొదట్లోనే నీరుగారిపోయాయి. జగన్ కూడా కేంద్రంలో బీజేపీ ఫుల్ మెజారిటీతో ఉంది...ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్రాన్ని ప్లీజ్ ప్లీజ్ అంటూ అడగడం తప్ప మనం ఏం చేయలేమని జగన్ తేల్చేశారు.


ఓ రకంగా జగన్ చెప్పింది కరెక్టే. కేంద్రంలో బీజేపీకి సొంతబలం ఎక్కువ ఉండటంతో ప్రత్యేకహోదా రావడం కష్టం. ఒకవేళ కాదు కూడదని పోరాటం చేస్తే రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా రావు. దీంతో జగన్ కేంద్రంతో సఖ్యతగానే మెలుగుతున్నారు. అయితే ప్రత్యేకహోదా కూడా పక్కకు వెళ్లిపోవడంతో ఎంపీలకు పెద్దగా పని లేకుండా పోయింది. ఏదో పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వడం తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్  గా ఉండటం లేదని తెలుస్తోంది.


గెలిచి ఆరు నెలలు కూడా కాలేదు కాబట్టి ఎంపీలు ఎవరు బయట కనబడటం లేదు. పైగా ఎంపీలు ఎవరు తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలని తిప్పికొట్టడం లేదు. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు మినహా 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీలే ఉన్నారు. ఈ 22 మంది కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరైన తర్వాత కంటికి కనబడటం లేదు. ఏదో కొన్ని కొన్ని ప్రారంభోత్సవాల్లో తప్ప ఎంపీలు బయటకు రావడంలేదు. గెలిచి ఆరు నెలలు కావొస్తున్న ఎంపీలు ఇంకా రెస్ట్ తీసుకోవడం వల్ల పార్టీకి ఇబ్బందే అవుతుంది. మరి చూడాలి ఎంపీలు ఎప్పుడు యాక్టివ్ అవుతారో?


మరింత సమాచారం తెలుసుకోండి: