తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టి  నేటికి 38 రోజులు కావస్తున్నా సమ్మె విషయంలో ప్రభుత్వం గాని, కార్మికులు గాని ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. అదీగాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్రమక్రమంగా బస్సు కష్టాలకు అలవాటుపడుతున్నారు. ఇక తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై జరుగుతున్న విచారణ రేపటికి వాయిదా పడింది.


ఇకపోతే సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ. సమ్మె విషయంలో తాము న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటామని. రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసి కోర్టు సూచించిన ప్రకారం సమస్య పరిష్కారానికి కృషిచేయాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైకోర్టు ఈరోజు వాదనల తర్వాత కమిటీ వేయాలని సూచించింది. ఈ విషయంలో అడ్వొకేట్ జనరల్ మాట్లాడుతూ, దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి రేపు మధ్యాహ్నంలోగా కమిటీ ఏర్పాటుపై వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.


దీనికి ప్రతి స్పందనగా మేం కూడా సీఎంను అదే కోరుతున్నాం. కమిటీ వేసి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి. భేషజాలకు పోకుండా కమిటీ ఏర్పాటుకు అంగీకరించి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నాం అని అశ్వత్థామరెడ్డి చెప్పారు.. ఇకపోతే కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం మాకు అంగీకారమే. కమిటీకి కాలపరిమితి ఉంటుందని అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే ప్రభుత్వం సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని కోర్టు తెలిపింది.


ఈ విషయాన్ని కాస్త తెలంగాణ సీయం ఆలోచించి మా సమస్యను సత్వరంగా పరిష్కరించాలని కోరుతున్నాం అని అశ్వత్థామరెడ్డి వివరించారు. ఇప్పటికే  ఆర్టీసీ సమ్మె కారణంగా ఎందరో కార్మికులు ప్రాణాలు వదిలారు. ఇప్పటికే ప్రతి కార్మికుడి కుటుంబం ఎలా బ్రతుకు వెళ్లదీయాలనే ఆలోచనలతో సతమతమౌతున్నారు. మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగక ముందే ప్రభుత్వం మేల్కొనాలని కార్మిక సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: