ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌కు వేదిక అయిన మ‌హారాష్ట్రలో...అస‌లు ట్విస్టు బుధ‌వారం జ‌ర‌గ‌నుందంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) విఫలమవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ సిఫారసు చేయడం.. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలుపడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీకీ తగిన సమయం ఇవ్వలేదంటూ శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు రానుంది.
 
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో, శివసేన 56 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 సీట్ల కన్నా ఎక్కువ సీట్లే గెలుచుకున్నాయి. సీఎం పీఠం చెరిసగం కాలం ఉండాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్‌ ఫిగర్‌కు చాలా దూరంలో నిలవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరచలేదు. రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను గవర్నర్‌ ఆహ్వానించినా, బలనిరూపణకు డెడ్‌లైన్‌ పొడిగించాలన్న ఉద్ధవ్ ఠాక్రే వినతిని గవర్నర్‌ తోసిపుచ్చారు. ఇక మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని బలనిరూపణ చేసుకోవాలని కోరింది. ఈ దిశగా ఎన్సీపీ-కాంగ్రెస్‌, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్సు చేయడం, దానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.


బీజేపీ, శివసేన తర్వాత ఎన్సీపీకి అవకాశం కల్పించిన గవర్నర్‌.. ఆ గడువు ఇంకా ముగియకముందే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫారసు చేస్తారని పలువురు నేతలు సందేహం లేవనెత్తుతున్నారు. ఇదే అంశం ఆధారంగా కోర్టులో వాధించ‌నున్న‌ర‌ని స‌మాచారం. సుప్రీంకోర్టు ఈ వాద‌న‌తో..ఏకీభ‌విస్తే....రాష్ట్రప‌తి పాల‌న‌పై ప‌రిణామాలు మార‌వ‌చ్చంటున్నారు. 20 రోజులు పాటు అనేక మలుపులు తీరిగిన మరాఠా రాజకీయంలో మ‌రోమార్పు ఖాయ‌మంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: