అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి ని కాపాడబోయి మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయిన  కార్యాలయ  అటెండర్‌ చంద్రయ్య గత కొన్ని రోజులుగా కాంచన్ బాగ్ లోని డిఆర్ డివో అపోలో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . విజయారెడ్డి సజీవ దహనం కాగా , ఆమెను కాపాడబోయిన డ్రైవర్ గురునాథం , నిందితుడు సురేష్ మృతి చెందిన విషయం తెల్సిందే .  చంద్రయ్య  పరిస్థితి రోజుకింత  విషమంగా మారుతున్నట్లు  కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . అయితే  చంద్రయ్య వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని తొలుత  చెప్పిన రెవెన్యూ అధికారులు , ఇప్పుడు మాట మార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు .


చంద్రయ్య కు అందుతున్న వైద్యం  గురించి  ప్రభుత్వ అధికారులు, ఏమాత్రం పట్టించుకోకపోగా ,  వైద్య ఖర్చులతో  ఇప్పుడు తమకేమి సంబంధం లేదని సరూర్ నగర్ తహశీల్ధార్ శ్రీనివాస్ రెడ్డి డిఆర్ డివో ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పడమే కాకుండా ,  చంద్రయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించాలని  సూచించినట్లు తెలుస్తోంది . ఇప్పటికే వరకు  చంద్రయ్య కు వైద్య  చికిత్స నిమిత్తం   మూడు లక్షల రూపాయల  బిల్లు అయిందని, దాన్ని చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు  కుటుంబ సభ్యులను కోరడం తో వారికి  ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో నెలకొంది .  ఇప్పటి వరకు వైద్య  చికిత్స నిమిత్తం  అయిన  బిల్లుమొత్తం  చెల్లిస్తేనే , ఇకపై  వైద్యం  కొనసాగిస్తామని అపోలో డిఆర్ డివో ఆసుపత్రి వర్గాలు ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు .


 డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు  చెల్లించిన తరువాత,  వైద్యం కోసం ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు  డిఆర్ డివో  అపోలో ఆసుపత్రి వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది . ప్రభుత్వం స్పందించి చంద్రయ్య కు మెరుగైన చికిత్స అందించడంతోపాటు , ఆసుపత్రి బిల్లు చెల్లించాలని లేకపోతే తాము కూడా   ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబసభ్యుల హెచ్చరిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: