చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరిన నేపథ్యంలో. ఇక అందరి దృష్టీ అంతే చారిత్రాత్మకమైన శబరిమలపై నిలిచింది. కేరళలోని పత్తనంథిట్ట జిల్లా దట్టమైన అడవుల మధ్య వెలసిన అయ్యప్ప స్వామి సన్నిధానంలోనికి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై ఇదివరకే విచారణను ముగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సారథ్యంలోని ధర్మాసనం. దీనిపై తీర్పు వెలవరించనుంది.


సుప్రీంకోర్టు తీర్పు వెలువడే సమయంలోనే అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని తెరవనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి మండల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమౌతాయని ట్రావెన్ కూర్ దేవస్వోం బోర్డు వెల్లడించింది. అయ్యప్పస్వామి మాలను ధరించిన భక్తులు దశలవారీగా శబరిమలకు వెళ్లడం ప్రారంభం కానుంది. అదే సమయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడబోతున్నందున కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. 


తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ ఏకంగా 65 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ ఒకే కేసుగా మలిచి సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును శుక్రవారం వెలువరించవచ్చని తెలుస్తోంది. అయోధ్య భూవివాదంపై హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడినందున. శబరిమలపై కూడా సానుకూల తీర్పు ఉంటుందనే అంచనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. కేరళ దేవస్వొమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. 


సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని శబరిమల ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించినట్లు కేరళ పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహరా తెలిపారు. అయిదు దశల్లో 10,017 మంది పోలీసులను భద్రత కోసం మోహరింపజేస్తామని అన్నారు. అదనపు డీజీపీ షేక్ దర్వేష్ ప్రధాన సమన్వయకుడిగా ఉంటారని అన్నారు. అయ్యప్ప స్వామి సన్నిధానంలోనికి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ వేలాదిమంది మలయాళీ మహిళలు అయ్యప్ప స్వామి ఆలయానికి తమకు తామే భద్రతను కల్పించారు. నీలక్కల్ నుంచి సన్నిధానం వరకూ రోడ్డుకు ఇరువైపులా నిల్చుని మహిళలను స్వామివారి దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోగలిగారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో.రక్షణగా ఉన్న పోలీసులను సైతం వారు ప్రతిఘటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: