20 రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగింపు పలుకుతూ పీఠం ఎక్కేది ఎవ‌రో తేలుతుంద‌ని భావించిన మ‌హారాష్ట్రంలో... మంగళవారం రాష్ట్రపతి పాలన విధించిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన మధ్య చర్చలు జరుగుతుండగానే.. ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదంటూ గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం.. కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం.. రాష్ట్రపతికి పంపించడం.. కోవింద్ ఆమోదం తెలుపడం చకచకా జరిగిపోయాయి. ఎన్సీపీ మరో మూడు రోజులు గడువు కోరడం వల్లే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. గవర్నర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణ‌యం కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియాగాంధీకి...ప్ర‌ధాని మోదీ ఇచ్చిన తాజా షాక్ అని అంటున్నారు. 


బీజేపీ-కాంగ్రెస్ పార్టీల ఎత్తుల‌కు వేదిక‌గా మారిన మహారాష్ట్ర రాజ‌కీయాల్లో...మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలు ఏకే ఆంటోని, వేణుగోపాల్, అహ్మద్ పటేల్ తదితరులతో సమావేశమయ్యారు. ఆమె ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తదుపరి చర్చల కోసం అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను ముంబైకి పంపించారు. పవార్‌తోపాటు శివసేన నేత సంజయ్ రౌత్‌తోనూ చర్చించాలని వారిని సోనియా ఆదేశించారు. మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, శరద్‌పవార్ కలిసి ముంబైలోని లీలావతి దవాఖానలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందుతున్న శివసేన నేత సంజయ్‌రౌత్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్టు సమాచారం. ఇలా స‌ర్కారు ఏర్పాట్లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే....కేంద్రం సిఫార‌సు చేయ‌డం, రాష్ట్రప‌తి పాల‌న విధించ‌డం జ‌రిగిపోయింది.


కాగా, త‌మ‌కు త‌గిలిన షాక్‌ను కాంగ్రెస్ జీర్ణించుకోలేక‌పోతోంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం ద్వారా గవర్నర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండానే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫారసు చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకుంటే గవర్నర్ ముందుగా అత్యధిక స్థానాలు గెలిచిన కూటమిని (బీజేపీ-శివసేన), ఆ తర్వాత రెండోస్థానంలో నిలిచిన కూటమిని (ఎన్సీపీ-కాంగ్రెస్) ఆహ్వానించాలి. ఒకవేళ పార్టీలను మాత్రమే ఆహ్వానించదలుచుకుంటే.. కాంగ్రెస్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి 48 గంటల సమయం ఇచ్చి శివసేన, ఎన్సీపికి 24 గంటలు మాత్రమే ఎందుకిచ్చారు?. ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతిపాలనకు ఎలా సిఫారసు చేస్తారు? అని సుర్జేవాలా ప్రశ్నించారు. మహారాష్ట్రలో విధించింది రాష్ట్రపతిపాలన కాదని.. ద్రోహబుద్ధి కలిగిన బీజేపీ పాలన అని మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అయితే తాము మద్దతు లేఖలను సంపాదించగలిగితే వెంటనే రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తారని కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: