ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. నేరుగా తనను సంప్రదించకపోయినా.. పత్రికల్లో వచ్చిన కథనాల చదివి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. చిన్నారి శశిధర్‌ వైద్య ఖర్చులకు కావాల్సిన డబ్బులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.


వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శశిధర డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. జ్వరం తీవ్రమై మెదడుకు చేరిందని, వెంటనే బ్రెయిన్‌ సర్జరీ చేయాలని, రూ. 3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. తమ కుమారుడికి వైద్యం చేయించేందుకు అంత డబ్బు లేదని ఆ తల్లిదండ్రుల బాధపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి.


ఈ కథనాలు సీఎం జగన్ దృష్టికి వచ్చాయి. వాటిని చదివిన ముఖ్యమంత్రి వెంటనే శశిధర్‌ వైద్య ఖర్చులకు కావాల్సిన డబ్బులను సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందించాలని అధికారులకు సూచించారు. శశిధర్‌కు సంబంధించిన రిపోర్టు తీసుకురావాలని సీఎం కార్యాలయం నుంచి శశిధర్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ వచ్చింది. తమ చిన్నారి పరిస్థితి తెలుసుకొని ముఖ్యమంత్రి నేరుగా స్పందించడంపై తల్లిదండ్రులు, శశిధర్‌ చదివే స్కూల్‌ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.


మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డెంగీ జ్వరం విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా అనేక కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బాలనటుడు ఒకరు మదనపల్లెలో డెంగీతో చనిపోయిన విషయం తెలిసిందే. గతంలోనూ డెంగీ విజృంభించినా మరణాలు ఈ స్థాయిలో ఉండేవి కాదు.. కానీ ఈ సీజన్ లో డెంగీ జ్వరాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అటు తెలంగాణలోనూ ఈ డెంగీ జ్వరాలు జోరుగా విజృంభిస్తున్నాయి. అక్కడ ఏకంగా హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుబట్టే స్థాయిలో తీవ్రత ఉంది. ఇలాంటి సమయంలో ఓ పత్రికలో వార్త చూసి జగన్ స్పందించడం సంతోషదాయకం.


మరింత సమాచారం తెలుసుకోండి: