సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినేట్ ఈరోజు భేటీ కానుంది. ఇసుక అక్రమ రవాణా చేసినా, అధిక ధరలకు అమ్మినా రెండేళ్ల పాటు జైలు శిక్ష, చట్టంలో మార్పులను కేబినేట్ ఆమోదించనుందని తెలుస్తోంది. సీఎం జగన్ ఈరోజు కేబినేట్ భేటీలో 85 గ్రామ న్యాయాలయాల గురించి చర్చించనున్నారు. ప్రతి రెవిన్యూ డివిజన్ కు ఒక గ్రామ న్యాయాలయం ఏర్పాటుతో పాటు 50,000 విలువ గల ప్రతి కేసు గ్రామ న్యాయాలయాల్లో పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. 
 
గ్రామ న్యాయాలయాలను మొబైల్ కోర్టు తరహాలో ఏర్పాటు చేసి సీఎం జగన్ పై కోర్టులపై భారాన్ని తగ్గించనున్నారని సమాచారం. పట్టణాల్లో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ గురించి కేబినేట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. ప్రతి 14 రోజులకొకసారి కేబినేట్ భేటీని నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఏపీ కేబినేట్ భేటీ కాబోతుంది. 
 
కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటు, 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలును కేబినేట్ ఆమోదించనుందని తెలుస్తోంది. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షల రూపాయల సాయం అందించే విషయంపై కేబినేట్ నిర్ణయం తీసుకోనుంది. ఇసుకకు సంబంధించి రాష్ట్రంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో, కొందరు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు ఇసుకను అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేబినేట్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. 
 
సీఎం జగన్ సింగపూర్ తో స్టార్టప్ ఏరియా రద్దుకు  కేబినేట్ భేటీలో ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కేబినేట్ ముందు ఉంచి కేబినేట్ ఆమోదం తీసుకోనుంది. కేబినేట్ సమావేశం ముగిసిన తరువాత రాజకీయపరమైన అంశాల గురించి కూడా సీఎం చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీ, న్యాయవాదుల సంక్షేమ నిధి గురించి కేబినేట్ భేటీలో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: