ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలే విచిత్రంగా ఉంది. కొద్ది రోజులుగా ఆర్టీసీ సమ్మెకు ఓ పరిష్కారం సూచించే ఉద్దేశ్యంతో హై కోర్టు విచారణ జరిపింది. అయితే ఎన్నిరోజులు విచారణ జరిపినా సమ్మె పరిష్కారం విషయంలో కోర్టు పరిష్కారం కనుక్కోలేకపోయింది.  సమ్మె చేస్తున్న యూనియన్లకైనా ప్రభుత్వానికైనా సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశమే పెద్ద అవరోధంగా మారింది.

 

సరే సిబ్బందిని విలీనం చేసుకోండని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్న విషయం నిజమే.  అదే సందర్భంలో సమ్మె చేయటాన్ని తప్పు అని కూడా కోర్టు చెప్పలేకపోతోంది. అందుకనే రెండు వర్గాలను ఏదో ఓ పాయింట్ దగ్గర కూర్చోపెట్టి రాజీ చేద్దామనే కోర్టు కూడా ప్రయత్నించింది. కాకపోతే తన ప్రయత్నంలో కోర్టు ఫెయిలయ్యింది.

 

ఇక్కడే హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలే విచిత్రంగా ఉంది. ప్రభుత్వం, యూనియన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించే బాధ్యతను ముగ్గురు సుప్రింకోర్టు మాజీ జడ్జీల కమిటిని నియమించనున్నట్లు ప్రకటించింది.  తన సూచనపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పమని అడిగింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హై కోర్టు చీఫ్ జస్టిస్ చెబితేనే వినని ప్రభుత్వం, కార్మిక నేతలు మాజీ జడ్జీల కమిటి చెబితే వింటారా ?  హైకోర్టునే తప్పుదోవ పట్టించేట్లుగా ప్రభుత్వం రోజుకో పద్దతిలో లెక్కలను అందచేసింది. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలను, లాభ, నష్టాలపై లెక్కలు అడిగితే రవాణాశాఖ కార్యదర్శి ఓ లెక్కిచ్చారు. రవాణాశాఖ మంత్రి కార్యాలయం మరో లెక్కను చూపించింది.

 

ఒకే సంస్ధకు సంబంధించిన లెక్కల విషయంలో ఇన్ని రకాలుగా నివేదికలు అందటంతో కోర్టు బిత్తరపోయింది. ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని కోర్టు వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అంటే హై కోర్టునే ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇక మాజీ జడ్జీలను ఏమి లెక్క చేస్తుంది ?  చూడబోతే తన బాధ్యతల నుండి హైకోర్టు పక్కకు తప్పుకుందా ? అన్న అనుమానం వస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో

 


మరింత సమాచారం తెలుసుకోండి: