చంద్రబాబునాయుడు తాజా మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.  ఇసుక కొరత గురించి తాను గురువారం నాడు దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను ప్రకటించినట్లుగా చెప్పుకుంటున్నారు.  అంటే తన ప్రకటనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడిపోయిందని చెప్పుకుని తృప్తిపడుతున్నట్లే కనిపిస్తోంది.

 

నిజానికి చంద్రబాబు చేయబోతున్న దీక్షకు ప్రభుత్వం ప్రకటించిన ఇసుక వారోత్సవాలకు ఎటువంటి సంబంధం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  కొరత బాగా తీవ్రంగా ఉన్న కాలంలో చంద్రబాబు దీక్షల పేరుతో ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అదే సమయంలో కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్ధితులను సమీక్షిస్తునే ఉంది.

 

వరదలు, వర్షాల కారణంగా మాత్రమే ఇసుకను తవ్వి తీయలేకపోయిందన్నది వాస్తవం. సరే కారణాలు ఏవైనా కానీ ఇసుక కొరత ఉందన్నది కూడా వాస్తవమే. అయితే కొరత విషయంలో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా బూతద్దంలో చూపించి నానా యాగీ చేసింది. 270 రీచ్ ల్లో కేవలం 60 రీచ్  నుండి మాత్రమే ఇసుక పోయిన నెలవరకు సరఫరా అయ్యేది. ఈనెల మొదటి నుండి ఇసుక సరఫరా పెరిగింది.

 

ప్రస్తుతం రోజుకు 1 లక్షల టన్నుల ఇసుక సరఫరా అవుతోంది. అంటే కొరత చాలా వరకు తీరిపోయినట్లే అనుకోవాలి. అందుకే రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలంటూ జగన్ ఆదేశాలిచ్చారు.

 

వాస్తవాలు ఇలాగుంటే చంద్రబాబు మాత్రం తాను చేయబోతున్న దీక్షకు ప్రభుత్వం భయపడిపోయిందని చెప్పుకుంటున్నారు. ఈ భయం ఏదో ముందే ఉండుంటే ఇసుక కొరత ఇంతలా ఉండేది కాదని ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే వారు కాదని అనటమే విచిత్రంగా ఉంది.  పనిలో పనిగా వైసిపి ప్రభుత్వంలో ఇసుకను అక్రమంగా దోచేసుకుంటున్న 67 మంది పేర్లను కూడా చంద్రబాబు విడుదల చేశారు. తన హయాంలో ఇసుకను దోచేసుకున్నారన్న ఆరోపణలు టిడిపి నేతలపై వచ్చాయి కాబట్టి ఇపుడు తాము కూడా అవే ఆరోపణలు చేయాలన్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: