కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ తహశీల్దార్ హసీనా బీ గత కొన్ని రోజుల నుండి పరారీలో ఉన్నారు. కర్నూలు జిల్లా ఏసీబీ అధికారులకు తహశీల్దార్ హసీనా బీ అనంతపురం జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందింది. కానీ ఏసీబీ అధికారులు అనంతపురం చేరుకునే సమయానికి హసీనా బీ అక్కడినుండి పరారైంది. ఈ నెల 7వ తేదీన గూడూరు తహశీల్దార్ హసీనా బీ బినామీ మహబూబ్ భాషా సురేష్ అనే రైతు నుండి 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 
 
ఏసీబీ అధికారులు తహశీల్దార్ హసీనా బీపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తరువాత పరారీలో ఉన్న హసీనా బీ కొరకు ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ప్రభుత్వ క్వార్టర్స్ లో తహశీల్దార్ హసీనా బీ ఉందని ఏసీబీ అధికారులకు సమాచారం అందగా ఆ క్వార్టర్స్ లో అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. కర్నూలు జిల్లా కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య సహకారంతో హసీనా బీ పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 
 
కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యతో తహశీల్దార్ హసీనా బీ సహజీవనం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు బృందాలు ఇద్దరి కోసం గాలిస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే హసీనా బీ కుటుంబ సభ్యులను విచారించారు. 
 
తహశీల్దార్ హసీనా బీ బినామీగా పట్టుబడిన మహబూబ్ భాషా హసీనా బీ సొంత అన్నగా  అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు హసీనా బీని త్వరలో పట్టుకొంటామని చెబుతున్నారు. గూడూరు మున్సిపాలిటీకు చెందిన డమాం సురేష్ అనే వ్యక్తి తన పొలంలోని అడంగల్ కు ఉన్న రెడ్ మార్క్ ను తొలగించాలని కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను చూపించగా తహశీల్దార్ హసీనా బీ 8 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసింది. చివరకు 4 లక్షల రూపాయలు ఇస్తే రెడ్ మార్క్ తొలగిస్తానని చెప్పింది. న్యాయంగా తొలగించాల్సిన రెడ్ మార్క్ కు 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో రైతు సురేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: