తెలుగుదేశంపార్టీ తొందరలో బిజెపిలో కలిసిపోతోందా ? బిజెపి ఎంఎల్సీ సోమువీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు విన్న వారికి ఇదే అనుమానం మొదలైంది. విశాఖపట్నం పర్యటనలో సోము మీడియాతో మాట్లాడుతూ తొందరలో టిడిపికి చెందిన 23 మంది ఎంఎల్ఏలను తాము కలిపేసుకుంటామని చెప్పటం సంచలనంగా మారింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టిడిపి తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. అందులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని వీర్రాజును అడిగినపుడు తొందరపడకుండా జరిగేది చూడండి అన్నట్లుగా చెప్పారు. అంటే చంద్రబాబుతో కలిపే మొత్తం ఎంఎల్ఏలు బిజెపిలో చేరబోతున్నారు అనే అర్ధం వచ్చేట్లే సోము చెప్పారు.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి చావు దెబ్బ తిన్న దగ్గర నుండి చంద్రబాబు నాయకత్వం మీద చాలామంది ఎంఎల్ఏలకు, పార్టీ నేతలకు నమ్మకం పోయింది. దానికితోడు నలుగురు రాజ్యసభ ఎంపిలను స్వయంగా చంద్రబాబే బిజెపిలోకి పంపటంతో అపనమ్మకం మరింత పెరిగిపోయింది. తర్వాత కొందరు మాజీ ఎంఎల్ఏలు, నేతలు కూడా బిజెపిలో చేరిపోయారు.

 

అదే సమయంలో ఎంఎల్ఏల్లో గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్ లాంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి మరీ బిజెపి అగ్రనేతలతో భేటి అయ్యారు. గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టిడిపి ఎంతోకాలం మనుగడ సాగించలేదనే అనుమానం పెరిగిపోతోంది.

 

అదే సమయంలో  బిజెపితో పొత్తకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటనల్లో అందరికీ అర్ధమైపోయింది. అందుకనే టిడిపి-బిజెపి పొత్తు అవసరం లేదని కొందరు కమలం నేతలు చెబుతున్నారు. కావాలంటే టిడిపిని బిజెపిలో విలీనం చేసుకునేందుకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. అంటే జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చివరకు బిజెపి నేతలు చెబుతున్నట్లు టిడిపి కమలంపార్టీలో విలీనం అయిపోతుందా ? అనే అనుమానాలూ పెరిపోతున్నాయి. దానికి క్లైమ్యాక్స్ గానే సోము వీర్రాజు ప్రకటన సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: