అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు డెమోక్రాట్లు. అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న తరుణంలో.. ఈ వ్యవహారంపై రిపబ్లికన్లలో ఆందోళన మొదలైంది. తీర్మానం నెగ్గే అవకాశం లేకున్నా... ట్రంప్ అధికార దుర్వినియోగంపై ప్రజల్లో చర్చ జరగాలని భావిస్తున్నారు డెమోక్రాట్లు. 


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని.. ప్రత్యర్థులపై పగ సాధించే పని చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. డెమోక్రటిక్‌ నేత జో బిడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు హంటర్‌ బిడెన్‌ ఉక్రెయిన్‌ సహజవాయు సంస్థలో కీలక పదవి చేపట్టారు. హంటర్‌ నియామకంపై దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ట్రంప్‌ ఒత్తిడి తెచ్చారనీ.. దర్యాప్తు జరిపించకపోతే ఆ దేశానికి 40 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని నిలిపివేస్తానని బెదిరించారని ఆరోపణలొచ్చాయి. 


జో బిడెన్ డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. జో బిడెన్ ఇమేజ్‌ను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని బెదిరించేందుకు ప్రయత్నించినట్లు డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. దీంతో ట్రంప్‌ను అభిశంసనకు పావులు కదుపుతున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నారు. దేశ ద్రోహం, ముడుపుల స్వీకరణ, తీవ్ర నేరాలకు పాల్పడినప్పుడు ప్రతినిధుల సభ దేశాధ్యక్షుణ్ని అభిశంసించవచ్చునని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. ట్రంప్‌ అధికార దుర్వినియోగం తీవ్ర నేరం కిందకు వస్తుందని డెమోక్రాట్ల వాదన. 


ఉక్రెయిన్ అధ్యక్షుడిని బెదిరించిన వ్యవహారంపై డెమోక్రాట్లు రహస్యంగా సాక్ష్యాలు సేకరించారు. మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ కార్యాలయాలకు చెందిన కీలక అధికారులు మాత్రం సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించారు. దీంతో మూడు రోజులు ప్రజల మధ్యన బహిరంగ విచారణ చేపట్టారు డెమోక్రాట్లు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే మెజారిటీ. అక్కడ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించడం లాంఛనమే. సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉంది. దీంతో అభిసంశన తీర్మానం నెగ్గడం కష్టమే.



మరింత సమాచారం తెలుసుకోండి: