గత జూలై నెలలో అప్పటి కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన సంగతి తెలిసిందే. 


దీంతో మొత్తం 17మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. దీనిపై సదరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ కృష్ణమురారీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. అక్టోబర్‌ 25న తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిం‍దే.


బుధవారం కర్ణాకటకు చెందిన 17మంది ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌కుమార్‌ విధించిన అనర్హత వేటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్‌- జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీంకోర్టు  సమర్థించినప్పటికీ.. వారిపై స్పీకర్‌ విధించిన అనర్హతకాలాన్ని కొట్టివేసింది. ప్రస్తుత అసెంబ్లీ కాలం 2023 సంవత్సరం ముగిసేవరకు అనర్హత ఎమ్మెల్యేలు పోటీ చేయరాదని స్పీకర్‌ నిబంధన విధించగా.. ఈ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలు రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.


‘ఆర్టికల్‌ 193 ని చర్చించిన అనంతరం అనర్హత అంశంలో​ మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అనర్హత అనేది.. చర్య జరిగిన కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి కొంతకాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం స్పీకర్‌కు లేదు’ అని న్యాయస్థానం అభిప్రాయపడింది. స్పీకర్‌ విధించిన అనర్హత వేటును మేం సమర్థిస్తున్నాం. అయితే, అనర్హత కాలాన్ని మాత్రం కొట్టివేస్తున్నాం’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ వ్యవహారంలో స్పీకర్‌ ‘కాసీ జ్యుడీషియల్‌ ఆథారిటీగా వ్యవహరించారని, అయితే, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా..? లేదా..? అన్నది మాత్రమే స్పీకర్‌ పరిధిలోకి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: