తెలంగాణ రాష్ట్రం  వస్తే ఆత్మహత్యలు ఉండవని సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో చెప్పారని కానీ ప్రస్తుతం తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు ఒకవైపు ,ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు మరొక వైపు కొనసాగుతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు .  ఆర్టీసీ చరిత్ర లో 40 రోజులు పాటు  సమ్మె జరగడం ఇదే మొదటి సారన్న ఆయన  , పొరుగు రాష్ట్రం లో ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడంతో , తెలంగాణలోనూ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తో కార్మికులు  సమ్మె చేస్తున్నారన్నారు.

ప్రభుత్వ వైఖరి చూస్తుంటే , ఇంకా ఎన్నిరోజులు సమ్మె జరుగుతుందో తెలియడం లేదన్నారు . ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సమస్య పరిష్కారానికి చొరవ చూపించకపోవడం విస్మయాన్ని కలుగజేస్తోందని జగ్గారెడ్డి అన్నారు . తక్కువ జీతాలు ఉన్న ఆర్టీసీ కార్మికులు అనారోగ్యకారణలతో ఇబ్బందులు పడుతున్నారని , ఆవుల నరేష్ అనే ఆర్టీసీ కార్మికుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు . మన ముఖ్యమంత్రి పరిపాలనలో ఇంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే,  ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు . ఉద్యమాలతో సాధించుకున్న  రాష్ట్రంలో, ఉద్యమాలకే  విలువలేకుండా పోయిందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు .

కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం, ఇది అంటూ మండిపడిన అయన ,  చనిపోయిన కార్మికులను ఎవరు ఆదుకోవాలంటూ ప్రశ్నించారు . చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆర్టీసీ అధికారులు  ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు . బలహీనుడికి బలవంతునికి జరుగుతున్న పోరాటం...భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూద్దామన్నా జగ్గారెడ్డి , బంగారు తెలంగాణ చేస్తామన్న టీఆరెస్ సర్కార్  , రాష్ట్రాన్ని  ఆత్మహత్యల తెలంగాణ గా మార్చిందని ధ్వజమెత్తారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: